కాకినాడ రూరల్: సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ తన కస్టడీ విచారణ సందర్భంగా పోలీసులనే బెదిరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో వరుసగా రెండవరోజు శుక్రవారం కూడా సాధిక్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు విచారించారు. వీఆర్వోలు, సాధిక్ న్యాయవాది సమక్షంలో సీఐ సీహెచ్ ప్రకాష్ ఈ విచారణ చేపట్టారు.
తాము జరిపిన విచారణ ప్రాతిపదికన తొలి రోజు సుమారు 25 ప్రశ్నలు వేసిన పోలీసులు, రెండో రోజు శుక్రవారం 80 పైబడి ప్రశ్నలు సంధించారు. ‘విచారణ పేరుతో వేధిస్తున్నట్టు కోర్టుకు చెబుతా. న్యాయస్థానంలో తేల్చుకుంటా’ అంటూ ఈ సందర్భంగా సాధిక్ పోలీసులను హెచ్చరించాడని, పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిని ప్రదర్శించాడని సమాచారం. సాధిక్ ఖాన్ రెండు రోజుల కస్టడీ శనివారం ఉదయంతో ముగియనుంది. ఉదయం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో తిరిగి అప్పగించనున్నారు.
స్లోపాయిజన్ ఇచ్చినట్లు అంగీకారం!
పోలీసుల విచారణలో జగదీశ్వరరెడ్డికి స్లో పాయిజన్ ఇచ్చినట్టు సాధిక్ అంగీకరించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి నుంచి స్లో పాయిజన్, పొటాషియం సైనైడ్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో సైనైడ్ విక్రయించిన ఇబ్రహీం అనే వ్యక్తిని శుక్రవారం సాధిక్ ముందు కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. ఫోన్‌పేలో దాదాపు రూ.60 వేల లావాదేవీలు, స్క్రీన్‌షాట్ల ఆధారాలతో విచారించగా స్లో పాయిజన్ మాత్రమే ఇచ్చామని, సైనైడ్ వినియోగించలేదని సాధిక్ చెప్పినట్లు తెలిసింది. కాకినాడలో ఇంట్లో, సర్పవరం జంక్షన్ ఆస్పత్రిలో జగదీశ్వరరెడ్డికి పలుమార్లు స్లో పాయిజన్ ఇచ్చినట్టు అంగీకరించినట్లు సమాచారం. కాగా నెపాన్ని మొత్తం సౌజన్యపై నెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
హత్యకు ‘ఏఐ’ సాయం
జగదీశ్వరరెడ్డిని హత్య చేసేందుకు సాధిక్ ఖాన్ చాట్‌జీపీటీలో విషప్రయోగంపై శోధించినట్టు పోలీసులు గుర్తించారు.థాలియం సల్ఫేట్, పొటాషియం సైనేడ్ వినియోగం, మోతాదులపై సమాచారం తెలుసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. దీనిప్రకారం సౌజన్యను భర్తకు దూరం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు రూ.25 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు సాధిక్ పథకం వేశాడు. ఆమెను బెదిరించడంతో పాటు మతం మారితే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. జగదీశ్వరరెడ్డి జూలై 2న మృతి చెందగా, ఒకదశలో సౌజన్యపై ఉప్పాడ వద్ద హత్యాయత్నం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నూకరాజు కుటుంబ ఆత్మహత్యలకు రెండు రోజుల ముందు, ఆగస్టు 14న సౌజన్య చేత ఆమె బంగారాన్ని రూ.40 లక్షలకు కుదవపెట్టించి అప్పులు తీర్చినట్టు విచారణలో వెల్లడైంది.
జగదీశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు కార్ల అప్పగింత
నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డికి చెందిన ఖరీదైన ఆడీ, బెంజ్, సఫారీ, ఎస్‌యూవీ వంటి నాలుగు ఖరీదైన కార్లను ఆయన తండ్రి భాస్కరరెడ్డి, సోదరి కరుణలకు పోలీసులు గురువారం రాత్రి అప్పగించారు. కార్లపై ఈఎంఐలు ఇబ్బందికరంగా మారాయని, కార్లు అప్పగించాలని జగదీశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు చేసిన అభ్యర్థన మేరకు వాటిని అప్పగించారు. సాధిక్ ఖాన్ ప్రొ షూటింగ్ అకాడమీలో సీజ్ చేసిన రైఫిళ్ళలో శిక్షణ కోసం సొంతంగా కొనుగోలు చేసుకున్న విద్యార్థులకు పోలీసులు అప్పగించారు.
ఇదీ చదవండి: ‘మంచి షూస్ కొనిస్తా.. వచ్చే ఏడాది పరిగెత్తు’..


