విశాఖపట్నం జిల్లా: ‘గత సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురం కలవడం(టీడీపీ, బీజేపీ, జనసేన) వల్లే కదా ప్రభుత్వం వచ్చింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వచ్చే పంచాయతీ, మండల ఎలక్షన్స్‌లో కూడా వాళ్లకి టికెట్లు ఇవ్వాలి కదా.. అది ధర్మం కదా’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో శుక్రవారం జరిగిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఉన్న 31 పంచాయతీల్లో కొన్ని జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తున్నానని చెప్పారు. మిగిలినవి తెలుగుదేశం పార్టీ వారికి ఇద్దామన్నారు. ఏ పార్టీకి ఎక్కడ ఇస్తానో ఏంటో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా క్యాడర్ సిద్ధం కావాలని, ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో తెలియదన్నారు.


