డిజిటల్ మ్యూజియంలో గాంధీజీ చిత్రాలను తిలకిస్తున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి, భట్టి, హర్కర వేణుగోపాల్ తదితరులు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికకు ఇదే ప్రాతిపదిక
ఇప్పటివరకు మండలికి పంపని సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి
రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు.. లేదంటే బీసీ, ఎస్సీ, జనరల్ కేటగిరీలకు ఒక్కొక్కటి!
పద్మశాలీలను పెద్దల సభకు పంపుతామని చెప్పిన సీఎం రేవంత్
తెరపైకి కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె వాణి పేరు
యాదవ, మున్నూరుకాపు సామాజిక వర్గాల నేతలకు ఈసారి అవకాశం
కమ్మ సామాజిక వర్గం నుంచి జెట్టి.. బ్రాహ్మణ కోటాలో హర్కర, దయాసాగర్‌రావు
ఎంబీసీ కోటాలో బస్వరాజు సారయ్య అభ్యర్థిత్వం రెన్యువల్ అంశమూ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో పెద్దల సభకు ఎవరిని పంపాలన్న దానిపై కసరత్తు మొదలయింది. త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నామినేట్ చేసే ప్రక్రియ నవంబర్ 15వ తేదీ కల్లా పూర్తయి గవర్నర్ ఆమోదం కూడా పొందాల్సి ఉండడంతో వీలున్నంత త్వరగా ఈ అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సామాజిక సమీకరణలను ప్రాతిపదికగా తీసుకుని ఈ అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మండలికి పంపని సామాజిక వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వీలును బట్టి మూడింటిలో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు లేదంటే ఎస్సీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అనూహ్యంగా మూడు స్థానాలూ బీసీ వర్గాలకు కేటాయించినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మాల, లంబాడీ, ముస్లిం, గౌడ్, ఎంబీసీ, వెలమ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం లభించింది. దీంతో ఈ దఫా ఆ వర్గాలు కాకుండా మిగిలిన వర్గాల నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల నేతలకు ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది. సమీకరణలను బట్టి రెండు, లేదంటే మూడింటికి మూడు స్థానాలూ ఈ వర్గాలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
యాదవ సామాజిక వర్గం నుంచి..
బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన పద్మశాలీలను ఈసారి పెద్దల సభకు పంపుతామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్గానికి ఒక స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సామాజిక వర్గం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు పున్నా కైలాశ్ నేత, ఈరవత్రి అనిల్, సంగీతం శ్రీనివాస్, సంగిశెట్టి జగదీశ్వరరావుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యాదవ సామాజిక వర్గానికి గత మూడేళ్ల కాలంలో రాజకీయ పదవుల్లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఈ కోణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లోకేశ్‌యాదవ్, టీజీఎల్‌డీసీ చైర్మన్ డాక్టర్ చరణ్‌కౌశిక్ యాదవ్‌లతో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, తోటకూర వజ్రేశ్ యాదవ్‌ల పేర్లు పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
దానంను ఏం చేద్దాం?
బీసీల్లో మరో ప్రధాన వర్గమైన మున్నూరు కాపులకు ఈసారి ప్రాధాన్యత లభించే అవకాశం ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. ఈ కోటాలో మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు డాక్టర్ పుంజాల వినయ్‌కుమార్, సత్తు మల్లేశం, జి.నిరంజన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో వచ్చే అవకాశముందా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకుని దానంను గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలా లేదా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపి మంత్రిని చేయాలా? లేదంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎం.సునీతా ముదిరాజ్ పేరు కూడా వినినిస్తుండగా వచ్చే నెలలో పదవీకాలం పూర్తి కానున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య (ఎంబీసీ) అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేసే అంశమూ ప్రభుత్వ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇతర బీసీ వర్గాల నుంచి కూడా వీలున్నన్ని పేర్లను పరిశీలించి ఈసారి గవర్నర్ కోటాలో కనీసం ఇద్దరు బీసీ నేతలను మండలికి పంపేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఎస్సీల్లో మాదిగలకు ప్రాధాన్యం!
బీసీలతో పాటు ఎస్సీలకు కూడా ఈసారి అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు స్థానాలు బీసీలకు ఇచ్చినా, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలని, అందులోనూ మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ సామాజిక వర్గం నుంచి ఎస్.సంపత్ కుమార్, దొమ్మాటి సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కొండ్రు పుష్పలీల, చారకొండ వెంకటేశ్, ప్రీతం, సింగాపురం ఇందిర, వక్కలగడ్డ చంద్రశేఖర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీల్లోనే మాల సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే డాక్టర్ జె.గీతారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోటూరి మానవతారాయ్‌ల పేర్లను పరిశీలించే అవకాశాలున్నాయి.
ఇక బీసీ, ఎస్సీలతో పాటు ఓసీలకు కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తే కమ్మ, బ్రాహ్మణ సామాజికవర్గాల నేతల పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ కోటాలో జెట్టి కుసుమకుమార్ (కమ్మ), హర్కర వేణుగోపాల్‌రావు, దయాసాగర్‌రావు (బ్రాహ్మణ)ల పేర్లు వినిపిస్తున్నాయి.
హైలైట్ కోసం.. మొదటి పేరాలో..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మండలికి పంపని సామాజిక వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వీలును బట్టి మూడింటిలో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు లేదంటే ఎస్సీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
దానంను ఏం చేద్దాం పేరాలో..
దానంను గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలా లేదా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపి మంత్రిని చేయాలా? లేదంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎస్సీల్లో మాదిగలకు ప్రాధాన్యం పేరాలో..
రెండు స్థానాలు బీసీలకు ఇచ్చినా, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలని, అందులోనూ మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారనే చర్చ జరుగుతోంది.


