ఆర్టీసీ,మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌.. త్వరలో భాగం కానున్న ఆటో రిక్షా సేవలు | Telangana Launches Common Pass for TSRTC Buses and Hyderabad Metro | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ,మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌.. త్వరలో భాగం కానున్న ఆటో రిక్షా సేవలు

Oct 2 2026 10:15 PM | Updated on Oct 2 2026 10:15 PM

Telangana Launches Common Pass for TSRTC Buses and Hyderabad Metro

సాక్షి,హైదరాబాద్‌:  నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. నగరంలో ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఆర్టీసీ,మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎస్‌ సంజయ్‌ జాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్‌ జాజు మాట్లాడుతూ.. నగర ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్‌కు కామన్‌ పాస్‌ విధానాన్ని ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తొలి దశలో ఆర్టీసీ, మెట్రో రైల్‌ సేవలను కామన్‌ పాస్‌ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

రోజూ 35 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్‌లో ప్రతిరోజూ దాదాపు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో, మరో 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని సీఎస్‌ తెలిపారు. చాలామంది ప్రయాణికులు ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి తమ గమ్యస్థానానికి సమీపంలోని స్టేషన్‌కు, ఆపై అక్కడి నుంచి కార్యాలయం లేదా ఇతర గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. ఇలా ఒకే ప్రయాణంలో పలుమార్లు రవాణా మారాల్సి రావడంతో ప్రయాణికులకు అదనపు వ్యయంతో పాటు సమయం, శ్రమ కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆర్టీసీ,మెట్రో కామన్‌ పాస్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

కామన్‌ పాస్‌లోకి ఆటో సేవలు
భవిష్యత్తులో ఆటో రిక్షా సేవలను కూడా కామన్‌ పాస్‌ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని సంజయ్‌ జాజు తెలిపారు. ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో సేవలను మరింత విస్తరించి, సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మీ-సేవ ద్వారా కామన్‌ పాస్‌
2011లో ప్రారంభమైన మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దాదాపు 400 రకాల సేవలను అందిస్తున్నామని సీఎస్‌ తెలిపారు. ఇకపై మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా మెట్రో,ఆర్టీసీ కామన్‌ పాస్‌లను జారీ చేసే సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నగర ప్రజలకు ప్రజా రవాణా మరింత సులభంగా, అందుబాటులో ఉండేలా ఆర్టీసీ, మెట్రో రైల్‌ సంస్థలు సమన్వయంతో ముందుకు సాగుతాయని సంజయ్‌ జాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement