సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బొల్లారం ఆయుధాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. 2009లో ఆర్మీలో చేరిన నిందితుడు మల్లేశ్.. ఆయుధాలపై ప్రత్యేక శిక్షణ తీసుకోగా, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా పలుమార్లు మల్లేశ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. 2025లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆయుధాల చోరీకి ప్లాన్‌చేశాడు.
కాగా, ఈ కేసులో మరో ఇద్దరి పాత్రను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. మల్లేశ్‌కు ఆయుధాలు భద్రపరిచే ఇద్దరు గోడౌన్ కీపర్లు ప్రత్యక్షంగా సహకరించినట్లు ఆధారాలు లభించడంతో ఆయుధాల గోడౌన్ కీపర్లు వినోద్, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేశ్‌కు, వీరిద్దరికీ మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. మల్కాజ్‌గిరి పోలీసులు మల్లేశ్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పది రోజుల పోలీసు కస్టడీలో ఉన్న మల్లేశ్‌ను విచారించగా ఈ చోరీ వెనుక ఉన్న అంతర్గత సంబంధాలు, పక్కా వ్యూహం బయటపడ్డాయి.
ఆయుధాల చోరీకి మల్లేశ్ నాలుగు నెలల క్రితమే స్కెచ్ వేసినట్లు తేలింది. మల్లేశ్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న నలుగురు ఆర్మీ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరిపేవాడు. ఆదివారం రాత్రి 8 గంటలకే అక్కడి సీసీటీవీ కెమెరాలు నిలిపివేస్తారని, అలాగే ఆ రోజు గార్డుల పహారా కూడా తక్కువగా ఉంటుందని వారి ద్వారా మల్లేశ్ సమాచారం సేకరించాడు. జూన్ 30న ఉద్యోగ విరమణ పొందిన మల్లేశ్, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులను ఇబ్బందుల్లోకి నెట్టాలనే కక్షతోనే ఆగస్టు 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఈ చోరీకి పాల్పడ్డాడు.
ఆర్మీలో చేరకముందే మల్లేశ్‌కు నేరచరిత్ర ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. 2005లో అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక దొంగతనం కేసు, అలాగే 2007లో అమ్రాబాద్ పరిధిలో బంగారం, వెండి దొంగతనం కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ, 2010లో అతను ఆర్మీ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యాడనే కోణంలో మిలిటరీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు విడివిడిగా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: నర్సింగ్ విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్


