‘నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు’ | Minister Tummala launched the Vijaya Mega Oil Packing Center | Sakshi
Sakshi News home page

‘నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు’

Oct 2 2026 9:48 PM | Updated on Oct 2 2026 9:48 PM

Minister Tummala launched the Vijaya Mega Oil Packing Center
  • విజయ ఆయిల్‌ను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలి
  • విజయ బ్రాండ్‌ను జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి తుమ్మల
  • ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యం
  • రైతులకు అవసరమైన మొక్కలు, డ్రిప్ సకాలంలో అందించాలి
  • ఆయిల్‌పామ్ రైతులకు మార్కెట్, ధర విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది

హైదరాబాద్,  శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని, మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. విజయ వంట నూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన విజయ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం నేడు రోజుకు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి ఎదగడం గర్వకారణమని మంత్రి తుమ్మల అన్నారు. విజయ ఆయిల్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రైవేట్ ఆయిల్ బ్రాండ్ల ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను సరసమైన ధరలకు అందించడంతో పాటు ధరల స్థిరీకరణ లక్ష్యంతో విజయ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విజయ ఆయిల్ తొలినాళ్లలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి మూడు రకాల వంట నూనెలను అందించగా, ప్రస్తుతం రైస్ బ్రాన్, నువ్వుల, దీపం, కొబ్బరి తదితర ఆరు రకాల వంట నూనెలను వినియోగదారులకు అందిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. విజయ్ బ్రాండ్ అంటే నాణ్యతకు గుర్తింపు అని, ప్రజల్లో ఉన్న ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవాలని సూచించారు.

శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో, పరిశుభ్రమైన, హైజెనిక్ వాతావరణంలో వంట నూనెలను ప్యాకింగ్ చేసేలా రూపొందించామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉత్పత్తి సామర్థ్యంతో పాటు నాణ్యతను మరింత పెంచాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లోకి విజయ అడుగుపెట్టిందని తెలిపారు.

విజయ ఆయిల్ ఉత్పత్తులు తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాలని మంత్రి తుమ్మల అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ విజయ్ బ్రాండ్‌కు మంచి మార్కెట్‌ను సృష్టించి, విజయ బ్రాండ్‌ను జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. విజయ ఆయిల్ ఉత్పత్తుల తయారీ, పంపిణీ, విక్రయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంత వినియోగదారుడికి ఉత్పత్తులు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు మూడున్నర లక్షల ఆయిల్‌పామ్ సాగు అవుతుందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం లక్ష ఎకరాల మేర ఆయిల్‌పామ్ సాగు విస్తరించాలని ఆకాంక్షించారు.

ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట అయినందున రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన ఆయిల్‌పామ్ గెలలను సేకరణ కేంద్రాల ద్వారా ఫ్యాక్టరీలకు తరలించి, సకాలంలో క్రషింగ్ చేసి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేసే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన మొక్కలు, డ్రిప్ సకాలంలో రైతులకు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డ్రిప్ ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులకు కూడా డ్రిప్ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆయిల్‌పామ్ దిగుమతులపై విధిస్తున్న దిగుమతి సుంకం విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని మంత్రి తుమ్మల కోరారు. దేశంలో వంటనూనెల అవసరాలను తీర్చే సామర్థ్యం తెలంగాణ రైతులకు ఉందని, రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును మరింత విస్తరిస్తే దేశానికి అవసరమైన వంటనూనెల ఉత్పత్తిలో తెలంగాణ కీలక పాత్ర పోషించగలదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా దిగుమతి విధానాలను రూపొందించాలని కోరారు.

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలపై ఆధారపడి వరి సాగు చేయడం పట్ల జాగ్రత్త వహించాలని, రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు.

భూగర్భ జలాలను సంరక్షించేందుకు ఫామ్‌పాండ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. వర్షపు నీటిని ఫామ్‌పాండ్లలోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల రీచార్జ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు నీటి సంరక్షణ చర్యలను చేపట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని కొనసాగించాలని సూచించారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటకు మార్కెట్, ప్రాసెసింగ్, విక్రయ సదుపాయాలు కల్పించే విధంగా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తెలంగాణను దేశంలోనే ప్రధాన ఆయిల్‌పామ్ ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.

విజయ్ బ్రాండ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని, విజయ ఉత్పత్తులను రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా విస్తరించాలని మంత్రి తుమ్మల సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్,  వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, రిటైర్డ్ ఐ.పి.ఎస్ శ్రీనివాస్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తెగువకు టీజీ గవర్నర్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement