హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ | Telangana Launches Common Pass For Metro RTC Services | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Oct 2 2026 4:08 PM | Updated on Oct 2 2026 4:27 PM

Telangana Launches Common Pass For Metro RTC Services

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ పాల్గొన్నారు. అనంతరం ఆటో ఛార్జీల సవరణ చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జీవో విడుదల చేశారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కామన్‌ పాస్, ‘మీ టికెట్‌’ మొబైల్‌ యాప్‌లను లాంఛనంగా  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. 

రేపు ఉదయం(శనివారం) 10 గంటలకు బేగంపేట నుంచి ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ద్వారా మెట్రోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రయాణం చేయనున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచలోనే తలమానికంగా ఉండేలా తీర్చి దిద్దుతున్నాం. హైదరాబాద్ దేశానికి దశదిశలా మారేలా చేస్తున్నామన్నారు.

కాగా, ఉమ్మడి పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్‌లలో లభించనున్నాయి. ఈ పాస్‌లతో పుష్పక్‌ మినహా  ఔటర్‌రింగ్‌ లోపల నడిచే అన్ని ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో వినియోగించుకోవచ్చు. నగర బస్సుల్లో నిత్యం సుమారు 25 లక్షలు, మెట్రో రైళ్లలో 4.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజువారీ ప్రయాణాలకు చాలామంది బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగిస్తున్నారు.  ఈ రెండు సేవల మధ్య సులభంగా మారే సౌకర్యం ఉమ్మడి పాస్‌లతో లభించనుంది.

రెండు రకాలుగా.. కార్డుకు అదనంగా రూ.వంద 
రెండు రకాల ఉమ్మడి పాస్‌లు ఉంటాయి. రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8500 చొప్పున ఉంటుంది. ఈ చార్జీల్లో డెయిలీ పాస్‌పై రూ.100, నెలవారీ పాస్‌పై రూ.1500 చొప్పున ఆర్టీసీ ఖాతాలో జమ అవుతాయి. మెట్రోకు  డెయిలీపై రూ.300, మంత్లీ పాస్‌పై రూ.7,000 చొప్పున లభిస్తాయి. మొదటిసారి ఉమ్మడి పాస్‌ను కొనుగోలు చేసినప్పుడు కార్డు ధర రూ.100 అదనంగా చెల్లించాలి.  దీనిని తిరిగి ఇచ్చేటప్పుడు రూ.వంద వాపస్‌ ఇస్తారు.

సిటీ బస్సుల్లో టికెట్‌ లెస్‌ జర్నీ.. 
మరోవైపు  సిటీ బస్సుల్లోలో టికెట్‌లెస్‌ జర్నీ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. కాగితపు టికెట్లకు బదులు మీ టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రదేశం, గమ్యస్థానాలను ఎంపిక చేసుకొని డిజిటల్‌ విధానంలో సులభంగా చార్జీలను చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టికెట్‌ వస్తుంది. ప్రయాణ సమయంలో దీనిని కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది.  

డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ రూ.600  
మీ టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రయాణికులు రూ.600 చెల్లించి డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ కూడా తీసుకోవచ్చు. బస్‌పాస్‌ కౌంటర్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే వీక్లీ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌తో వారం పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన వెంటనే మొబైల్‌ యాప్‌లోనే అప్పటికప్పుడు రెన్యూవల్‌ చేసుకోవచ్చు. 

ఇదీ చదవండి: ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement