కేబీఆర్‌ పార్కులో వైల్డ్‌లైఫ్‌ వీక్‌ వేడుకలు.. ఫ్రీ ఎంట్రీ | Hyderabad KBR Park: Wild Life Week 2006 Celebrations Date and Other Details | Sakshi
Sakshi News home page

Hyderabad: కేబీఆర్‌ పార్కులో వైల్డ్‌లైఫ్‌ వీక్‌ వేడుకలు

Oct 2 2026 6:17 PM | Updated on Oct 2 2026 6:21 PM

Hyderabad KBR Park: Wild Life Week 2006 Celebrations Date and Other Details

ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన

వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

సాక్షి, హైద‌రాబాద్‌: నగరంలోని ప్రతిష్టాత్మక కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు ‘వైల్డ్‌ లైఫ్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌’ నిర్వహించనున్నారు. వన్యప్రాణులు, పక్షులు, వృక్షజాలం, కీటకాలు తదితర జీవ వైవిధ్యంపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి పరిరక్షణపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. వారంరోజులు పాటు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కేబీఆర్‌ పార్కులో ప్రకృతి, వన్యప్రాణులకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

అక్టోబర్‌ 2: కేబీఆర్‌ పార్కు చరిత్ర, రక్షిత ప్రాంతంగా దాని ప్రాధాన్యం, డెక్కన్‌ పీఠభూమి నివాస ప్రాంతాలు, నగరంలో జాతీయ పార్కు ప్రాముఖ్యతపై పార్కు సిబ్బంది, వృక్షశాస్త్ర నిపుణులు వివరిస్తారు. 

అక్టోబర్‌ 3: పార్కులో కనిపించే పక్షుల గుర్తింపు, వాటి ఆహారపు అలవాట్లు, గూళ్లు, నివాస ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పక్షుల ప్రాధాన్యంపై బర్డ్‌వాక్‌ నిర్వహించనున్నారు.

అక్టోబర్‌ 4: పార్కులోని ముఖ్యమైన చెట్లు, పొదలు, స్థానిక–విదేశీ వృక్షజాతులు, ఔషధ గుణాలు, మొక్కలు, పక్షులు, కీటకాలు, క్షీరదాలకు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు.

అక్టోబర్‌ 5: సీతాకోకచిలుకల జీవన విధానం, మొక్కల పరాగ సంసర్కంలో వాటి పాత్ర, కాలానుగుణ కార్యకలాపాలు, మొక్కలు–సీతాకోకచిలుకల మధ్య సంబంధంపై నిపుణులు వివరిస్తారు.

అక్టోబర్‌ 6: పాములు, బల్లులు తదితర సరీసృపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, వాటి గుర్తింపు లక్షణాలు, నివాస ప్రాంతాలు, పర్యావరణంలో వాటి పాత్ర, అపోహలు–నిజాలు, సంరక్షణ చర్యలను వివరించనున్నారు.

ఇదీ చ‌ద‌వండి: హైద‌రాబాదీల‌కు గుడ్‌న్యూస్‌.. ఒక టికెట్‌తో డ‌బుల్ జ‌ర్నీ!

అక్టోబర్‌ 7: కేబీఆర్‌ పార్కులో కనిపించే కీటకాలు, సాలీళ్లు, ఇతర అకశేరుక జీవుల జీవ వైవిధ్యంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఆహార గొలుసు, కుళ్లిపోయే పదార్థాల విచ్ఛిన్నం, పర్యావరణ వ్యవస్థలో వీటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు.

అక్టోబర్‌ 8: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమాల ముగింపు, విజేతలకు బహుమతుల ప్రదానం, పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాల అందజేతతో వైల్‌లైఫ్‌ వీక్‌ వేడుకలు ముగియనున్నాయి.  

ఇదీ చ‌ద‌వండి: ప్లైదుబాయ్ ఘ‌ట‌న‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అల‌ర్ట్‌ 

ఫొటోగ్రఫీ పోటీకి అవకాశం.. 
వైల్డ్‌లైఫ్‌ వీక్‌ సందర్భంగా వన్యప్రాణుల ఫొటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తున్నారు. కేబీఆర్‌ పార్కు వన్యప్రాణులు, పక్షులు, ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఫొటోలను పోటీకి పంపే అవకాశం కల్పించారు. ఫొటోలు పంపేందుకు చివరి తేదీ అక్టోబర్‌ 6గా ప్రకటించారు.

ప్రవేశం ఉచితం.. 
ప్రజలు విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేబీఆర్‌ పార్కులోని జీవ వైవిధ్యాన్ని తెలుసుకోవడంతో పాటు వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ప్రవేశం ఉచితంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement