సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌లోని సంతోషీమాత ఆలయంపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఖండించారు. సంతోషీమాత ఆలయాన్ని సందర్శించిన ఆయన పూజారులు, భక్తులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పూజలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేశాడు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల వెనుక ఒకే తరహా ప్యాటర్న్ కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. నిందితులకు మతిస్థిమితం లేదంటూ కేసులను పక్కదారి పట్టించొద్దు’ పోలీసులను హెచ్చరించారు.
నిజంగా మతిస్థిమితం లేకపోతే ఆలయాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తేల్చాలన్నారు. ఆలయాల భద్రతపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే బాధ్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


