breaking news
santoshimata temple
-
ఆలయంలో దుండగుడి దుశ్చర్య
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బస్‌డిపో సమీపంలో సంతోషిమాత దేవాలయంలోకి చొరబడిన డుండగుడు కర్రతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీసులు తెలిపిన మేరకు.. శుక్రవారం ఉదయం ఆలయంలో భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఓ అగంతకుడు గర్భగుడిలోకి వెళ్లి కర్రతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పూజారి, భక్తులు వెంటనే నిందితుడిని పట్టుకొని తాళ్లతో కట్టివేసి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇన్స్పెక్టర్ సైదులు సిబ్బందితో వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్థానికుల ఆందోళనలు, రాస్తారోకో ఈ విషయం తెలుసుకున్న బీజేపి, వీహెచ్‌పి, బజరంగ్‌దల్ నాయకులు, కాలనీవాసులు దేవాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై బైటాయించి దర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌జాం కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మెట్రో స్టేషన్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళనకు దిగారు. చర్యలు తీసుకుంటాం ఆలయ చైర్మన్ శ్రీనివాసయాదవ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎల్బీనగర్ ఇంచార్జి ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సంగారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, దిల్‌సుఖ్‌నగర్‌లో కుటుంబంతో నివసిస్తున్నట్లు గుర్తించామన్నారు. సంతోíÙమాత ఆలయాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించి సంఘటనగురించి ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
సంతోషీమాత ఆలయంపై దాడి.. బీజేపీ రాష్ట్ర చీఫ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్ నగర్‌లోని సంతోషీమాత ఆలయంపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఖండించారు. సంతోషీమాత ఆలయాన్ని సందర్శించిన ఆయన పూజారులు, భక్తులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పూజలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేశాడు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల వెనుక ఒకే తరహా ప్యాటర్న్ కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. నిందితులకు మతిస్థిమితం లేదంటూ కేసులను పక్కదారి పట్టించొద్దు’ పోలీసులను హెచ్చరించారు.నిజంగా మతిస్థిమితం లేకపోతే ఆలయాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తేల్చాలన్నారు. ఆలయాల భద్రతపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే బాధ్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పెళ్లి రోజు భార్యకిచ్చిన వాగ్దానం.. రూ.8 కోట్లతో ఆలయం నిర్మించిన భర్త
భువనేశ్వర్: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బింజార్పూర్ మండలం ఛికొణ గ్రామంలో అద్భుతమైన సంతోషి మాత ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. సుమారు 3 ఎకరాల స్థలంలో 64 అడుగుల ఎత్తుతో రూ.8 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆలయ నిర్మాణ శైలితో ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా మెరుగులు దిద్దుకుంది. భార్యకు ఇచ్చిన మాట ప్రకారం అత్తవారి ఊరులో సంతోషి మాత ఆలయం సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకోవడం ఈ ఆలయం విశిష్టత. హైదరాబాద్‌లోని పారిశ్రామికవేత్తగా స్థిరపడిన జగత్సింగ్పూర్ ప్రాంతానికి చెందిన ఖేత్రాబాసి లెంక తన భార్య బైజయంతి లెంకకు పెళ్లినాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ ఆలయం నిర్మించి పలువురి అభినందనలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే... బైజయంతి చిన్ననాటి నుంచి సంతోషిమాత భక్తురాలు. గ్రామంలో అమ్మవారి ఆలయం లేకపోవడంతో అమ్మవారి ఫొటోను ఇంట్లో ఉంచి పూజలు చేసుకునేది. ఆమె ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో కొన్ని కారణాలు వలన ఫొటోను పూజించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో గ్రామంలో ఆలయం ఉంటే ఇటువంటి విచారకర పరిస్థితి తలెత్తేది కాదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. అనంతరం 1992 సంవత్సరంలో ఖేత్రాబాసి లెంకతో ఆమెకి వివాహం జరిగింది. అప్పుడు ఆమె చిన్ననాటి వేదనని భర్తతో పంచుకోవడంతో కల ఫలించింది. భార్య అకుంఠిత భక్తిశ్రద్ధలపై తన్మయం చెందిన భర్త, అత్తవారి ఊరులో సంతోషిమాత ఆలయం నిర్మించేందుకు సంకల్పించాడు. గ్రామస్తుల సహకారంతో భార్యాభర్తల సంకల్పం మరింత బలంగా ముందుకు సాగింది. తన కోసం భర్త ఆలయం కట్టించి గ్రామానికి ఇవ్వడం కంటే అమూల్యమైన కానుక వేరేమీ ఉండదని బైజయంతి లెంకా మురిసిపోతోంది. పుట్టిన రోజున శంకుస్థాపన 2008 మార్చి 10వ తేదీన బైజయంతి లెంకా కుమార్తె పుట్టిన రోజు పురస్కరించుకొని గ్రామంలో సంతోషిమాత ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2014 వరకు ఆలయ పనులు శరవేగంగా సాగాయి. ఆ తర్వాత క్రమంగా ఈ పనులు మందగించాయి. నత్తనడకన సాగిన నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు దాదాపు 15 ఏళ్లు పట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన 40 మంది శిల్పులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఆలయం నిర్మాణం పూర్తి చేశారు. స్థానిక శిల్పులు తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. రాజస్థానీ శిల్పులు పాలరాతి పనులకు నగిషీలు దిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, గణేష్, హనుమాన్, నవగ్రహాల ఆలయాలు నిర్మించారు. ఆలయం పేరుతో నిర్మాణ స్థలం కొనుగోలు చేశారు. రూ.8 కోట్ల భారీ వ్యయంతో ఆలయాన్ని నిర్మించడం అమ్మవారి అనుగ్రహం మాత్రమేనని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయం అత్యంత మహిమాన్వితంగా వెలుగొందుతుందని భక్తిభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 లక్షల అంచనా వ్యయం భార్య బైజయంతి లెంక కోరిక మేరకు సంతోషిమాత ఆలయ నిర్మాణానికి ఖేత్రాబాసి లెంక 2008 సంవత్సరంలో సంకల్పించారు. అప్పట్లో ఈ ఆలయ నిర్మాణ వ్యయం అంచనా రూ.30 లక్షలు మాత్రమే. 5 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని భావించారు. అయితే దాదాపు 15 ఏళ్ల పాటు అడుగడుగున పలు అవాంతరాలు తలెత్తినా నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంపై లెంకా దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలయాపనతో నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతూపోయింది. చివరకు చిన్న ఆలయంగా సంకల్పించిన సంతోషిమాత ఆలయం 64 అడుగుల ఎత్తుతో నింగిని తాకుతున్నట్లు ఎదగడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నారు. త్వరలో ఆలయం పూర్తి హంగులతో భక్తుల సందర్శనకు అందుబాటులోకి వస్తుంది. 15 ఏళ్లు పట్టింది ఈ గుడి మా ఊరు ప్రజల కోసం కట్టించడం జరిగింది. సంతోషిమాత ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు సైతం చాలా సహకారం అందించారు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రధాన ఆలయ నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఆలయ సముదాయంలో పూల అంగడి, పూజ సామాగ్రి దుకాణం వంటి మౌలిక వసతులు అంచెలంచెలుగా ఏర్పాటు అవుతాయి. ఆలయ సముదాయంలో భక్తుల కోసం ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -
రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..
వరంగల్ : రైలు కింద పడి విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్‌లోని సంతోషి మాత గుడి దగ్గర్లోని రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. మొగుళ్లపల్లి మండలానికి చెందిన అసంపల్లి పృధ్వీన్ (23) అనే యువకుడు శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొవడానికి కారణాలు తెలియరాలేదు. అతని జేబులో ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా అతన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. మృతుడు అంబెద్కర్ యూనివర్సిటీలో ఓపెన్‌డిగ్రీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఎంజీఎమ్ ఆస్పత్రికి తరలించారు. (మట్టెవాడ)


