పెళ్లి రోజు భార్యకిచ్చిన వాగ్దానం.. రూ.8 కోట్లతో ఆలయం నిర్మించిన భర్త

Odisha Man Builds Santoshi Matha Temple To Fulfill Wife Wish - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా బింజార్‌పూర్‌ మండలం ఛికొణ గ్రామంలో అద్భుతమైన సంతోషి మాత ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. సుమారు 3 ఎకరాల స్థలంలో 64 అడుగుల ఎత్తుతో రూ.8 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆలయ నిర్మాణ శైలితో ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా మెరుగులు దిద్దుకుంది. భార్యకు ఇచ్చిన మాట ప్రకారం అత్తవారి ఊరులో సంతోషి మాత ఆలయం సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకోవడం ఈ ఆలయం విశిష్టత. హైదరాబాద్‌లోని పారిశ్రామికవేత్తగా స్థిరపడిన జగత్‌సింగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఖేత్రాబాసి లెంక తన భార్య బైజయంతి లెంకకు పెళ్లినాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ ఆలయం నిర్మించి పలువురి అభినందనలు అందుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే...
బైజయంతి చిన్ననాటి నుంచి సంతోషిమాత భక్తురాలు. గ్రామంలో అమ్మవారి ఆలయం లేకపోవడంతో అమ్మవారి ఫొటోను ఇంట్లో ఉంచి పూజలు చేసుకునేది. ఆమె ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో కొన్ని కారణాలు వలన ఫొటోను పూజించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో గ్రామంలో ఆలయం ఉంటే ఇటువంటి విచారకర పరిస్థితి తలెత్తేది కాదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది.

అనంతరం 1992 సంవత్సరంలో ఖేత్రాబాసి లెంకతో ఆమెకి వివాహం జరిగింది. అప్పుడు ఆమె చిన్ననాటి వేదనని భర్తతో పంచుకోవడంతో కల ఫలించింది. భార్య అకుంఠిత భక్తిశ్రద్ధలపై తన్మయం చెందిన భర్త, అత్తవారి ఊరులో సంతోషిమాత ఆలయం నిర్మించేందుకు సంకల్పించాడు. గ్రామస్తుల సహకారంతో భార్యాభర్తల సంకల్పం మరింత బలంగా ముందుకు సాగింది. తన కోసం భర్త ఆలయం కట్టించి గ్రామానికి ఇవ్వడం కంటే అమూల్యమైన కానుక వేరేమీ ఉండదని బైజయంతి లెంకా మురిసిపోతోంది.

పుట్టిన రోజున శంకుస్థాపన
2008 మార్చి 10వ తేదీన బైజయంతి లెంకా కుమార్తె పుట్టిన రోజు పురస్కరించుకొని గ్రామంలో సంతోషిమాత ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2014 వరకు ఆలయ పనులు శరవేగంగా సాగాయి. ఆ తర్వాత క్రమంగా ఈ పనులు మందగించాయి. నత్తనడకన సాగిన నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు దాదాపు 15 ఏళ్లు పట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన 40 మంది శిల్పులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఆలయం నిర్మాణం పూర్తి చేశారు. స్థానిక శిల్పులు తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. రాజస్థానీ శిల్పులు పాలరాతి పనులకు నగిషీలు దిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, గణేష్‌, హనుమాన్‌, నవగ్రహాల ఆలయాలు నిర్మించారు. ఆలయం పేరుతో నిర్మాణ స్థలం కొనుగోలు చేశారు. రూ.8 కోట్ల భారీ వ్యయంతో ఆలయాన్ని నిర్మించడం అమ్మవారి అనుగ్రహం మాత్రమేనని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయం అత్యంత మహిమాన్వితంగా వెలుగొందుతుందని భక్తిభావం వ్యక్తం చేస్తున్నారు.

రూ.30 లక్షల అంచనా వ్యయం
భార్య బైజయంతి లెంక కోరిక మేరకు సంతోషిమాత ఆలయ నిర్మాణానికి ఖేత్రాబాసి లెంక 2008 సంవత్సరంలో సంకల్పించారు. అప్పట్లో ఈ ఆలయ నిర్మాణ వ్యయం అంచనా రూ.30 లక్షలు మాత్రమే. 5 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని భావించారు. అయితే దాదాపు 15 ఏళ్ల పాటు అడుగడుగున పలు అవాంతరాలు తలెత్తినా నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంపై లెంకా దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలయాపనతో నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతూపోయింది. చివరకు చిన్న ఆలయంగా సంకల్పించిన సంతోషిమాత ఆలయం 64 అడుగుల ఎత్తుతో నింగిని తాకుతున్నట్లు ఎదగడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నారు. త్వరలో ఆలయం పూర్తి హంగులతో భక్తుల సందర్శనకు అందుబాటులోకి వస్తుంది.

15 ఏళ్లు పట్టింది
ఈ గుడి మా ఊరు ప్రజల కోసం కట్టించడం జరిగింది. సంతోషిమాత ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు సైతం చాలా సహకారం అందించారు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రధాన ఆలయ నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఆలయ సముదాయంలో పూల అంగడి, పూజ సామాగ్రి దుకాణం వంటి మౌలిక వసతులు అంచెలంచెలుగా ఏర్పాటు అవుతాయి. ఆలయ సముదాయంలో భక్తుల కోసం ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top