187 పోస్టులకు 8 వేల మంది!
ఆకాశమంత చదువు చదివితే ఏం లాభం.. పొట్టకూటి కోసం నేలపై కూర్చుని పరీక్ష రాయక తప్పలేదు. డిగ్రీలు, పీజీలు చేతిలో ఉన్నా.. కనీసం హోంగార్డు ఉద్యోగమైనా దొరక్కపోతుందా.. అన్న నిరాశ నిండిన నిరీక్షణ అది. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో డిసెంబర్ 16న కనిపించిన దృశ్యం, దేశంలో నిరుద్యోగ సమస్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం 187 హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ఏకంగా 8,000 మంది యువత కదిలివచ్చారు. దీనికి కనీస అర్హత కేవలం 5వ తరగతి ఉత్తీర్ణత. కానీ, వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం.
సాధారణ పరీక్ష కేంద్రాలు సరిపోకపోవడంతో, అధికారులు జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ (విమానాశ్రయం) రన్‌వేనే వేదికగా మార్చారు. నిరుద్యోగ యువత మండుతున్న ఎండలో, ఆకాశం కింద నేలపైనే కూర్చుని తమ భవిష్యత్తును వెతుక్కుంటూ పరీక్ష రాశారు. ఈ నియామకాలు కేవలం ఒప్పంద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయినప్పటికీ, కనీస ఉపాధి కరువైన తరుణంలో యువత వీటిపైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, 8,000 మంది హాజరయ్యారు. ఇంతమంది కోసం 20 పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది.
– సాక్షి, నేషనల్ డెస్క్


