సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.
మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు.
మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్‌డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.
వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్‌లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది.


