భువనేశ్వర్: ఒడిశాలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS)లో తొమ్మిదో తరగతి విద్యార్థి సిబా ముండా మృతి కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది. హాస్టల్ బాత్‌రూమ్‌లో జారిపడి చనిపోయాడని సంస్థ యాజమాన్యం చెప్పిన మాటలు వాస్తవం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పప్పు ఒలికిపోవడంలో వివాదం తలెత్తిందని, ముగ్గురు సహవిద్యార్థులే అతడిపై దాడిచేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుడు కియోంజర్ జిల్లాకు చెందిన మైనర్ బాలుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ కేసుకు సంబంధించి పోస్ట్‌మార్టం నివేదిక అత్యంత కీలక ఆధారంగా మారింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదని, హింసాత్మకమైన హత్య అని వైద్య నివేదిక స్పష్టం చేసింది. హాస్టల్ వాష్‌రూమ్‌లో ముగ్గురు సహచర విద్యార్థులు సిబా ముండాపై దాడి చేసి, ప్రాణాలు తీశారని పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురూ మైనర్లు కావడంతో వారిని అరెస్ట్ చేసి, ఖుర్దా జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వారిని రిమాండ్ నిమిత్తం కరెక్షనల్ హోమ్‌కు తరలించినట్లు సమాచారం.
మరోవైపు ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన కిస్ (KISS) సంస్థ తీరుపై పోలీసులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, ఇతర విద్యార్థులను బెదిరించడం తదితర ఆరోపణలతో సంస్థ అదనపు సీఈఓ ప్రమోద్ పాత్రతో సహా మొత్తం ఎనిమిది మంది అధికారులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను వివరించే వైద్య పత్రాలను తండ్రికి అందజేయకపోవడం, వారికి మృతదేహాన్ని అప్పగించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అలాగే బాధితునికి చికిత్స అందించిన ఏడుగురు వైద్యులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో విద్యార్థి మరణంపై నిజాలు దాచడం తగదని, విచారణలో లోపాలు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తన కుమారుడి మరణానికి సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బాధితుడి తండ్రి రఘునాథ్ ముండా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: చైనా డ్యామ్ కుట్ర.. భారత్‌కు జల ముప్పు తప్పదా?


