లేదంటే సుదూరానికి తరలించండి
ట్రాఫిక్ స్తంభనలకు కేంద్రస్థానాలుగా మారిన 9 టోల్‌ప్లాజాలపై సుప్రీంకోర్టు అసహనం
వారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ, ఎంసీడీలకు సూచన
న్యూఢిల్లీ: టోల్‌ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్‌ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్‌సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది.
వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్‌ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది.
వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్‌పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎంసీడీకి పరిహారం ఇవ్వండి
‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్‌బూత్‌లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్‌హెచ్‌ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది.
కన్నాట్ ప్లేస్‌లోనూ పెట్టేస్తారా?
కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్‌ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్‌ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్‌ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్‌ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్‌గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్‌ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్‌తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్‌కు సీజేఐ సూచించారు.


