ఇదోరకం ప్రేమ!  | Bengaluru Woman booked for allegedly harassing police inspector | Sakshi
Sakshi News home page

ఇదోరకం ప్రేమ! 

Dec 18 2025 5:45 AM | Updated on Dec 18 2025 5:45 AM

Bengaluru Woman booked for allegedly harassing police inspector

లేడీ గబ్బర్‌ సింగ్‌ లవ్‌ టార్చర్‌ 

పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను వేధించిన మహిళ

అది అక్టోబర్‌ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 45 ఏళ్ల ఇన్‌స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్‌కి ఒక అపరిచిత నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్‌స్పెక్టర్‌ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్‌ అప్పుడే మొదలైంది!

ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. 
ఆ మహిళ పదేపదే ఫోన్‌ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్‌లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్‌స్పెక్టర్‌కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్‌స్పెక్టర్‌ను మానసిక ఆందోళనకు గురిచేసింది.

రక్తంతో లేఖ 
అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్‌స్పెక్టర్‌ ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్‌కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్‌ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. 

అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్‌స్పెక్టర్‌ అధికారిక డ్యూటీ నంబర్‌కు అనవసర కాల్స్, మెసేజ్‌లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.

ఆత్మహత్య చేసుకుంటా.. 
డిసెంబర్‌ 12న, ఇన్‌స్పెక్టర్‌పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్‌ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement