బ్యాట్, కారంతో వీరంగం వేస్తున్న గంజాయి బ్యాచ్ సభ్యులు
కారం, క్రికెట్ బ్యాట్, రాళ్లతో హల్‌చల్ చేసిన గంజాయి బ్యాచ్
భయంతో ఇళ్లల్లోకి పరుగులు తీసిన స్థానికులు
ఎమ్మెల్యే బొండా అండదండలు ఉన్నాయని హూంకరింపులు
నిందితులకు కొమ్ముకాస్తున్న టీడీపీ నాయకులు.. కేసు కట్టనివ్వకుండా ఒత్తిడి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్‌లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది.
విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్‌కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు.

రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు.


