సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు.
అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్‌ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్‌లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.



