ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది.
సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్‌ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి.
బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు.
ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్‌లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు.
తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్‌కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు.
భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు.
ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు.
ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది.
దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు.
బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


