సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.
ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్‌సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.
అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..
ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్‌లు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్‌భవన్(పూర్వ రాజ్‌భవన్)కు చేరుకుంటాయి.
అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వైఎస్ జగన్‌కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు.


