ఎగుమతులకు కస్టమ్స్‌ కత్తెర! | Customs restrictions are hindering exports | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు కస్టమ్స్‌ కత్తెర!

Dec 18 2025 4:52 AM | Updated on Dec 18 2025 4:52 AM

Customs restrictions are hindering exports

నిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు 

నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత 

సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం 

చెన్నై, ముంబయి వైపు మళ్లుతున్న ఎగుమతులు 

ధ్రువీకరించే బృందాలు లేక..  విశాఖ మందులు హైదరాబాద్‌కు తరలింపు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ప్రధాన ఫర్నిచర్‌ షోరూమ్‌లలో విక్రయించే ఫర్నిచర్‌ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్‌ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్‌కతా లేదా చెన్నై పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. 

ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్‌ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్‌ ఇచ్చేందుకు కస్టమ్స్‌ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫరి్నచర్‌ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్‌ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్‌ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. 

అన్నీ ఉన్నా.. అవే లేవు 
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్‌ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. 

సర్టిఫైడ్‌ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్‌’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్‌ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

200 ఉత్పత్తులకే పరిమితం! 
విశాఖ కస్టమ్స్‌ హౌస్‌లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చెన్నైలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్‌ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్‌లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్‌ ఇస్తారు. 

కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చెన్నై లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్‌ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. 

వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్‌కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్‌ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చెన్నైతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి. 

కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా?  
కస్టమ్స్‌ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్‌ కస్టమ్స్‌ హౌస్‌కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్‌ హౌస్‌ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్‌హోల్డర్స్‌ చెబుతున్నా, కస్టమ్స్‌ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్‌ చేయగలుగుతున్నారు. 

కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్‌కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్‌ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement