ఇతర శాఖల అధికారుల పెత్తనంపై ఆగ్రహం
ఇన్ సర్వీస్ టెట్, సెలవు రోజుల్లో అదనపు తరగతులపై అసంతృప్తి
పోరుబాటకు సిద్ధమైనఉపాధ్యాయులు
నేడు కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా
‘మేము సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు డఏలు వచ్చేవి.ఇప్పుడు ఏడాదికి రెండమెగా పీటీఎంలు వస్తున్నాయి’.
మా సర్వీసులో విద్యార్థులు నోట్సులు సరిగా రాశారో లేదో చెక్ చేసేవాళ్లం.., ఇప్పుడు చిక్కీలు, కోడిగుడ్లు లెక్కలు చూడడం, యాప్‌ల్లో వివరాల నమోదుకే సమయం సరిపోవడం లేదు’..
ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి పోస్టులు చంద్రబాబు పాలనపై గురువుల ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి.
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. టీచర్లకు యాప్‌ల భారం ఉండదు, కేవలం బోధనకే పరిమితం చేస్తామన్న మాట నీటి మూటైంది. మరోపక్క ఇన్ సర్వీస్ టెట్ రద్దు చేస్తామని, దీనిపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న హామీని సైతం అమలు చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బకాయిల సంగతేంటి?
పెండింగ్ బకాయిలు, ఐఆర్, డీఏలు ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పాఠ్యాంశాలకు సంబంధం లేని వివరాలు పదుల సంఖ్యలో యాప్‌ల్లో నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడుల నిర్వహణపై ఇతర శాఖల పెత్తనం
పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచడానికి 75 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెండో శనివారం, ఆదివారాలు, పండగ సెలవుల్లో సైతం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరగతులను పరిశీలించే బాధ్యతను ఎంపీడీవోలు, మండల వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించింది.
వాస్తవానికి మండలానికి ఇద్దరు ఎంఈవోలు, డీవైఈవోలు, జిల్లా స్థాయిలో డీఈవో ఉన్నారు. వీరిని కాదని ఇతర శాఖలకు పెత్తనం అప్పగించడంపై టీచర్లు మండిపడుతున్నారు. గతేడాది మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, విద్యార్థుల రేషనలైజేషన్ వంటి విధులకు రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వం వినియోగించింది.
ఒత్తిడి పెంచి.. ప్రయోజనాలు ఎగ్గొట్టాలని..
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా ఉపాధ్యాయులకు ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించింది. నాలుగు డీఏలకు కేవలం ఒక్క డీఏతో సరిపెట్టింది. పదవీ విరమణ పొందినవారికి ఏడాదిన్నరగా గ్రాట్యుటీ, లీవ్‌ఎన్‌క్యాష్మెంట్ ఇవ్వలేదు. ప్రతి నెలా మెడికల్ బీమా డబ్బులు చెల్లిస్తున్నా ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందడం లేదు.
అప్పుచేసి బిల్లులు చెల్లించినా తర్వాత రీయింబర్స్‌మెంట్ చేయడం లేదు. దీంతో ఆర్థిక బకాయిల కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో సర్కారు రివర్స్ గేర్ వేసింది. ఒత్తిడి పెంచితే ఆర్థిక అంశాలు తెరపైకి రావనే భావనతో వ్యవహరిస్తోంది.
ఇందులో ఇన్ సర్వీస్ టెట్ అంశం కీలకంగా మారింది. దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. రాష్ట్రంలో మాత్రం టెట్ నిర్వహించడం, ప్రత్యేక శిక్షణ, నివేదికల పేరుతో ఇబ్బంది పెట్టడం వేధింపుల్లో భాగమేనని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలతో పాటు ఇతర శాఖల అధికారుల పెత్తనంపై గురువులు పోరుబాటకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నేడు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు యూటీఎఫ్‌తో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి.బదిలీ అయి పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని.. టీచర్లపై ఇతర శాఖల పెత్తనం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు.


