ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా?
దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా?
ఇంత తక్కువ ధరకు భూములిస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా?
వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి?
అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి?..
ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: పలు ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు కట్టబెడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ– రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా కేవలం 99 పైసలకే 27.10 ఎకరాలు కట్టబెట్టడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మరిన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఉండేవని తెలిపింది.
అలా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రశ్నించింది. అందరికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకే భూములు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రహేజాకు భూ కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోంది: పొన్నవోలు
విశాఖపట్నం, మధురవాడ, ఐటీ హిల్‌లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు..

– పొన్నవోలు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపులను, కేటాయింపుల విధానాన్ని సవాలు చేశారని వివరించారు.
– అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
– ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారమని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను కొనసాగించింది
– రహేజా రియల్టీ సంస్థ కాదని ఏజీ చెబుతుండగా, పొన్నవోలు అడ్డుతగులుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీనేనని, కావాలంటే జీవో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు.
– ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
– పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైనదేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసింది.



