రూ.4 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్
కొమ్మాది: సాగర్‌నగర్ సమీపంలోని గుడ్లవానిపాలెం వద్ద బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు జరిగిన ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ గతంలో శిథిలావస్థకు చేరుకున్న తుపాను రక్షిత భవనం ఉండేది. ప్రమాదకరంగా ఉండటంతో జీవీఎంసీ అధికారులు ఇటీవల ఆ భవనాన్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉండటంతో టీడీపీ వార్డు ప్రధాన నాయకుడి కన్ను దీనిపై పడింది. గ్రామస్తుల సహకారంతో ఈ ఖాళీ స్థలంలో చకచక పునాదులు వేసి ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనని, ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నాక, అక్కడ నిర్మించిన బేస్‌మెంట్‌ను వెంటనే తొలగించారు. ఎవరైనా మళ్లీ ఈ స్థలంలో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


