దేశ ప్రగతిలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకం
గాజువాక: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, సేవలను ప్రభుత్వ సంస్థలు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు రెండు రోజుల సీపీఎస్‌ఈ వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కమ్ ఎగ్జిబిషన్ 2025 బుధవారం ప్రారంభమైంది. ఎంఎస్‌ఎంఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బీహెచ్‌ఈఎల్ ఈడీ గుమ్మళ్ల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 ప్రభుత్వ రంగ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీహెచ్‌ఈఎల్ ఈడీ మాట్లాడుతూ.. నాణ్యమైన ఉత్పత్తులను, సరసమైన ధరలకు, సకాలంలో సరఫరా చేస్తే స్థానిక పరిశ్రమలకు ఆర్డర్లు నిరంతరం లభిస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జెమ్ పోర్టల్‌లో సభ్యులుగా చేరితే, దేశవ్యాప్తంగా ఏ పరిశ్రమకై నా తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఆన్‌లైన్‌లో కోట్ చేయవచ్చని వివరించారు. ఎంఎస్‌ఎంఈ జేడీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకమని కొనియాడారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, చిన్న తరహా పరిశ్రమలకు మధ్య ఎంఎస్‌ఎంఈ శాఖ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పీఎస్‌యూలు తమకు కావాల్సిన విడిభాగాల్లో ఏటా 20 శాతం ఆర్డర్లను తప్పనిసరిగా చిన్న తరహా పరిశ్రమలకే ఇవ్వాలని, దీని అమలు కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో పీఎస్‌యూలను సందర్శించే అవకాశం స్థానిక పారిశ్రామికవేత్తలకు ఉండేదని, దీని వల్ల ఏ సంస్థకు ఎటువంటి ఉత్పత్తులు అవసరమో తెలిసేదని గుర్తుచేశారు. మళ్లీ అటువంటి అవకాశాన్ని కల్పిస్తే ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన విడి భాగాలను నాణ్యతతో అందించగలమని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలను అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వాసీవా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, లఘు ఉద్యోగ్ భారత్ కార్యదర్శి ఎ.కృష్ణ బాలాజీ, వివిధ సంస్థల ప్రతినిధులు సత్య సర్వశుద్ధి, వై.సాంబశివరావు, ఎన్.మధుసూదన రెడ్డి, శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


