పట్టించుకోరా..? | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోరా..?

Dec 18 2025 7:20 AM | Updated on Dec 18 2025 7:20 AM

పట్టించుకోరా..?

పట్టించుకోరా..?

ప్రజాప్రతినిధులూ..

సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటన వచ్చి ఆరేళ్లు దాటినా.. కార్యకలాపాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగితాలపై చక చకా పనులు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కదలడం లేదు. రైల్వే బోర్డు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌గా సందీప్‌ మాథుర్‌ని నియమించి.. నెలలు గడుస్తున్నా తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే జోన్‌కు కీలకమైన పీసీపీఓ, పీసీఓఎంతో సహా పలు వురు ప్రిన్సిపల్‌ అధికారులను కూడా నియమించారు. అయితే జోన్‌కు శాశ్వత కార్యాలయం లేకపోవడంతో జీఎం విశాఖకు అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ఉన్న రైల్వే భవనంలో ఉంటూ కొన్ని కార్యకలాపాలపై సమీక్షలు నిర్వహించేందుకు మాత్రమే జీఎం పరిమితమయ్యారు. మిగతా అధికారులు మాత్రం బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని

చంద్రబాబు సర్కారు

జోన్‌ డీపీఆర్‌ ఆమోదం తెలిపి నెలలు గడుస్తున్నా.. జీఎం నియామకం పూర్తయినా.. గెజిట్‌ విడుదల చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తుండటం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంగా మారింది. ఎంపీలు కనీసం జోన్‌ గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడంతో.. రైల్వే బోర్డుకు గెజిట్‌ విషయంలో ఎలాంటి ఆదేశాలు అందడం లేదు. అదేవిధంగా ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌కు ప్రధానాదాయం అయిన వాల్తేరు డివిజన్‌ను రెండుగా చీల్చేందుకు దాదాపు బోర్డు సిద్ధమైంది. ఇందులో కీలక ఆదాయ వనరు అయిన కేకే లైన్‌ని రాయగడ డివిజన్‌కు కేటాయించడంపైనా.. టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి జోన్‌ వ్యవహారంపై ఎలాంటి ఆసక్తి లేదన్న భావన కేంద్రంలో నెలకొనడంతో.. బోర్డు కూడా కీలకమైన అంశాన్ని కూడా గాలికొదిలేసింది. కేవలం ప్రచార ఆర్భాటానికి జోన్‌ తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ టీడీపీ ఎంపీలు హడావుడి చేస్తున్నారే తప్ప.. గెజిట్‌ విడుదల ఎప్పుడనే విషయంపై కేంద్రాన్ని నిలదీయకపోవడం సిగ్గు చేటంటూ వాల్తేరు వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికై నా టీడీపీ ఎంపీలు షోలు మానేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత త్వరగా గెజిట్‌ విడుదల చేయించాలని, తద్వారా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాస్తయినా పనిచేయాలని కోరుతున్నారు.

తాత్కాలిక కార్యాలయం

సిద్ధమైనా..

వీఎంఆర్డీఏ ది డెక్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎం తాత్కాలిక కార్యాలయం నిర్మాణ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ పనులు కూడా 90 శాతం వరకూ పూర్తయ్యాయి. అయితే ప్రారంభం మాత్రం ఇంకా చేసేందుకు గెజిట్‌ మోకాలడ్డుతోంది. గెజిట్‌ విడుదలైతే తప్ప.. తాత్కాలిక కార్యకలాపాలకు మోక్షం కలిగే అవకాశం లేదని వాల్తేరు డివిజన్‌ అధికారులు అంటున్నారు. గెజిట్‌తో పాటుగా కార్యాచరణ ప్రకటిస్తే, జీఎంతో సహా మొత్తం 180 మంది అధికారులు, ఉద్యోగులు నియమితులవుతారు. అప్పుడు మాత్రమే జోన్‌ కార్యకలాపాలు మొదలవుతాయి. తొలుత దసరా అనీ.. తర్వాత దీపావళి.. ఇలా పండగలు పేరుతో పబ్బం గడిపేస్తున్నారే తప్ప.. విశాఖ జోన్‌ విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతికి కూడా కష్టమేననే నిస్పృహ అందరిలోనూ నెలకొంది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ వ్యవహారం.. మూడడుగుల ముందుకు ఆరడుగుల వెనక్కి అన్న చందగా మారిపోయింది. ఓవైపు విశాఖ కేంద్రంగా జోన్‌కు అధికారుల నియామకం.. ఉద్యోగులకు ఆప్షన్లు.. విభాగాల వారీగా ఉద్యోగుల విభజన అంటూ హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. గెజిట్‌ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్రాన్ని

నిలదీయాల్సిన ఎంపీలు.. తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ జనాన్ని మభ్య పెడుతున్నారే తప్ప.. రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. జోన్‌, వాల్తేరు డివిజన్‌ విభజన విషయంలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.

జోన్‌ గెజిట్‌ విడుదల జాప్యంపై

నోరు మెదపని చంద్రబాబు ప్రభుత్వం

జీఎం తాత్కాలిక కార్యాలయం

పూర్తయినా అవరోధాలు

గెజిట్‌ విడుదలైతే తప్ప తాత్కాలిక

కార్యకలాపాలకు మోక్షం లేదు

కేవలం కార్యాలయాల విజిట్‌కి

మాత్రమే ఎంపీలు పరిమితం

ఉత్తరాంధ్రకి అన్యాయం

జరుగుతున్నా చలనం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement