ద్రోణంరాజు కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి అంబటి, పార్టీ నేతలు
బీచ్‌రోడ్డు: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఇంటికి మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విచ్చేసి, ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శ్రీనివాస్, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి తదితరులతో కలసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దివంగత నేతలు ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీవత్సవ కూడా ఎల్లవేళలా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ల తాత, నాన్న రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. శ్రీవత్సవ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలు తనను ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అందరితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు.


