యువకుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

యువకుల బీభత్సం

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

పెందుర్తి మండలం రాంపురం వద్ద లారీ డ్రైవర్‌పై తీవ్రదాడి

డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హత్యాయత్నం

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్న బాధితుడు

అనంతరం ఆటోతో ఆర్టీసీ బస్‌ను ఢీకొని వాగ్వాదం

గంజాయి మత్తులో

పెందుర్తి: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. పూటుగా గంజాయిని సేవించిన ఇద్దరు యువకులు పెందుర్తి మండలం రాంపురం వద్ద జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. ఆటోలో వచ్చి ఓ లారీ డ్రైవర్‌(ఓనర్‌)పై దారి దోపిడీకి పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన అతడిపై నిర్ధాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారు. రాళ్లు, చాకుతో ఇష్టానుసారం దాడి చేసి అతడ్ని తీవ్రంగా గాయపరిచారు. అదే ఊపులో ఆటోలో వెళ్లి రాంపురం వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్‌ను ఢీకొన్నారు. డ్రైవర్‌, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి ఆటో పాడైంది డబ్బులు ఇవ్వాలని తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మొత్తానికి గంజాయి మత్తులో ఇద్దరు యువకులు భీతవహ వాతావరణాన్ని సృష్టించారు. వివరాలివి.. చినముషిడివాడకు చెందిన బంటు త్రినాథరావు సొంత లారీ నడుపుకుంటున్నాడు. మంగళవారం రాజాం నుంచి మొక్కజొన్న లోడుతో అనకాపల్లి వద్ద ఉన్న కోడూరుకు తరలించాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో డీజీల్‌ అయిపోవడంతో రాంపురం సమీపంలోని ఆనందపురం–అనకాపల్లి బైపాస్‌ పక్కన లారీ నిలుపుదల చేశాడు. డబ్బాలో డీజిల్‌ తెచ్చుకునేందుకు సమీపంలోని బంక్‌కు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి అతడ్ని ఆపారు. రూ.50 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో డబ్బులు ఇస్తున్న క్రమంలో త్రినాథరావు వద్ద ఉన్న కొంత నగదుతో పాటు సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డు లాక్కున్నారు. ఈ క్రమంలో ఏటీఎం పిన్‌ చెప్పాలని అడిగారు. దానికి బాధితుడు నిరాకరించడంతో నడిరోడ్డుపైనే రాళ్లు, కత్తితో అతడిపై తీవ్రస్థాయిలో దాడికి తెగబడ్డారు. ఏదోలా వారి నుంచి తప్పించుకున్న త్రినాథరావు తీవ్ర గాయాలతోనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సమీపంలోని బంక్‌లోకి వెళ్లాడు. అయితే బంక్‌ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని బాధితుడ్ని పంపేశారు. అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని దాబాలోకి వెళ్లడంతో దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుడ్ని పెందుర్తిలో ఆసుపత్రికి తరలించారు.

అయినా ఆగలేదు..

తీవ్ర గాయాలపాలైన బాధితుడు త్రినాథరావు బంక్‌లోకి వెళ్లినప్పుడు వెంబడించిన దుండగులు కాసేపు అతడి కోసం అక్కడే మాటు వేశారు. అయితే బాధితుడు చాకచక్యంగా తప్పించుకుని దాబాలోకి వెళ్లిపోవడంతో వారు రాంగ్‌ రూట్‌లో పెందుర్తి వైపు వెళ్లి రాంపురం కూడలి వద్ద ఆర్టీసీ బస్‌ను ఢీకొన్నారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆటో పాడైంది రూ.25 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆ ఇద్దరు యువకులు ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ లోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మత్తులో దారి దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు యువకులు పెందుర్తిలోని నల్లక్వారి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పెందుర్తి క్రైం విభాగం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దారి దోపిడీ జరిగిన రాంపురం సమీపంలోని ప్రాంతం, (ఇన్‌సెట్‌) గాయపడిన బంటు త్రినాథరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement