మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు కష్టానికి తగిన ప్రతిఫలం వేతనం రూపంలో లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏయూ పరిపాలన భవనం వద్ద వారు తమ సమస్యలను వెల్లడించారు. యూనివర్సిటీలో 10 సంవత్సరాలకుపైగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెంటనే వేతనాలను పెంచాలని, అలాగే మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని అధికారులను కోరారు. విశాఖపట్నంలో జీవన వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని వారు వాపోయారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో, తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తమ పిల్లలకు మంచి విద్య అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతనాల్లో ఎటువంటి పెంపు జరగలేదని తెలిపారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు 28 రోజుల విధానం, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో డి.కిరణ్ ప్రభు, ఏ.వి.ఎస్.ప్రసాద్, ఎం.పోలినాయుడు, ఎస్.తేజ, ఓ.ఆర్.రాజి, మదీనా వల్లి తదితరులు పాల్గొన్నారు.


