జంట హత్యల కేసు.. కోర్టు సంచలన తీర్పు | Death penalty for Agra wife And her cousin Case | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసు.. కోర్టు సంచలన తీర్పు

Apr 2 2026 9:10 AM | Updated on Apr 2 2026 9:13 AM

Death penalty for Agra wife And her cousin Case

లక్నో: నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వివాహేతర సంబంధం కారణంగా తన భార్య, ఆమె బంధువును అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో భర్త, అతడి తండ్రి, సోదరుడికి స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో తాజా తీర్పు చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాలోని ఏత్మాద్‌పూర్ ప్రాంతంలో 2022లో ఈ ఘటన వెలుగు చూసింది. గౌరవ్‌, పూజా ఇద్దరు భార్యాభర్తలు. వీరి ఇంటి సమీపంలోనే ఆమె బంధువు శివం సిసోడియా నివాసం ఉంటున్నారు. అయితే, గౌరవ్‌ ఇంట్లో లేని సమయంలో శివం సిసోడియా తరచూ పూజ ఇంటికి రావడాన్ని భర్త గుర్తించాడు. దీంతో, వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. ఇంతలో,  మే 27, 2022న శివం.. పూజను కలిసేందుకు వారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరినీ చూసిన గౌరవ్ కుటుంబ సభ్యులు, వారిని పట్టుకుని వీధిలోకి లాక్కొచ్చారు.

అనంతరం గౌరవ్, అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి కర్రలతో దాడి చేసి, కిందపడిన తర్వాత గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో ఇద్దరి గొంతులు కోసి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత గౌరవ్ తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోగా, పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు 14 మంది సాక్షులను విచారించింది. సీసీటీవీ ఫుటేజీ, మృతుడు శివం సోదరుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ముగ్గురినీ దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గౌరవ్ తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement