టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ మహిళా నేత ఆవేదన | TDP Supporter Allegations On MLA Kakarla Suresh | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ మహిళా నేత ఆవేదన

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 11:26 AM

TDP Supporter Allegations On MLA Kakarla Suresh

వంచించిన తీరును సీఎంకు చెబుతాననే భయంతో కిడ్నాప్‌ చేయించాడు 

టీడీపీ మహిళా నేత వెంగమాంబ ఆరోపణలు 
 

ఉదయగిరి: రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ వంచించాడని, ఈ వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం వడ్డీపాళెంకు చెందిన టీడీపీ మహిళ నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్‌ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి, సమాజానికి సేవ చేయాలనే తపన­తో తన ఆలోచనలను పంచుకోవాలని బెంగళూరు­లో ఉన్న తాను వచ్చానన్నారు. అయితే.. పోలీసులు కారు చెక్‌ చేయాలని తనను కిందకు దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్‌ను, తన సోదరుడిని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తమ సెల్‌ఫోన్లు తీసుకుని సీఎం సభ అయి ఆయన వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం  వదిలి పెట్టారని ఆరోపించారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో సయోధ్య చేసుకోవాలని ఓ మహిళ ఎస్సై తనతో చెప్పడాన్ని చూస్తే.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యే తనతో వ్యçవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతాననే భయంతోనే తనను కిడ్నాప్‌ చేయించాడని మండిపడ్డారు. తమను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తనను ఇంకా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. ఈ విషయా­న్ని పార్టీ పెద్దల దృíష్టికి తీసుకెళతానని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement