ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు! | Oil Prices Plunge After Trump Cancels Iran Strike Plans | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!

Jun 12 2026 1:36 AM | Updated on Jun 12 2026 1:41 AM

Oil Prices Plunge After Trump Cancels Iran Strike Plans

మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర  ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇరాన్‌ - అమెరికా మధ్య జరిగిన యుద్ధం చమురు ధరలు భారీ పెరుగుదలకు కారణమైంది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి ప్రణాళికలను రద్దు చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఊహకందని మార్పులు జరిగాయి.

ట్రంప్ ప్రకటన అనంతరం చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 3.6 శాతం తగ్గి బ్యారెల్‌కు 89.73 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా అదే స్థాయిలో తగ్గి 86.83 డాలర్లకు పడిపోయాయి. ఈ తగ్గుదల పెట్టుబడిదారులలో తాత్కాలిక ఊరటను కలిగించింది.

ఇరాన్‌పై అమెరికా “కఠిన చర్యలు” తీసుకుంటుందనే హెచ్చరికలు, అలాగే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యాయి. చమురు సరఫరా మార్గాలపై ప్రభావం పడవచ్చన్న భయంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పరిస్థితులు మారడంతో మార్కెట్ దిశ కూడా వెంటనే మారిపోయింది.

ట్రంప్ ప్రకారం.. ఇరాన్ నాయకత్వంతో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. తుది అంశాలపై అన్ని పక్షాల అంగీకారం లభించింది. ఈ కారణంగానే సైనిక దాడులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. చర్చలు పరోక్షంగా కొనసాగుతున్నాయని, శాంతి ఒప్పందం దిశగా కొన్ని కీలక అంశాలు ముందుకు సాగుతున్నాయని సమాచారం.

అయితే.. ఈ ప్రకటనలో తుది ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఒప్పందం పూర్తయ్యే వరకు పరిస్థితులు పూర్తిగా స్థిరపడినట్లు చెప్పలేమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, సైనిక చర్యల భయం తగ్గడంతో ప్రపంచ చమురు మార్కెట్లు తాత్కాలికంగా స్థిరత్వం దిశగా కదులుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement