విశాఖ సిటీ : దేశాన్ని అంటరానితనం, అమానవీయతల నుంచి బయటపడేసి మనుషులంతా ఒకటేనని చాటి చెప్పిన మహనీయులను తలచుకోవడం జన్మ రుణం తీర్చుకోవటం లాంటిదేనని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వి.చలం పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంతంలో మహాత్మా జ్యోతిబాపూలే గౌతు లచ్చన్నల విగ్రహాల వద్ద ‘బడుగు యోధుల మహనీయుల మాసం‘ గోడ పత్రికను తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యుడు నరసింహ చారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మం, జ్యోతిబాపూలే, అంబేడ్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పి.శివశంకర్, గౌతు లచ్చన్న వంటి బహుజన యోధుల శోభాయాత్రలు ప్రతీ పట్టణంలో నిర్వహించాలని సూచించారు. ఇంతవరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చాలన్నారు. దీనికోసం బీసీలు ఏకమై పోరాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఉన్నత మానవీయ సమాజం కోసం తపించి జాతిని జాగృతం చేసిన యోధులు జన్మించిన ఏప్రిల్ మాసాన్ని బడుగు యోధుల మహనీయుల మాసంగా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యులు నరసింహాచారి మాట్లాడుతూ విశాఖ నగరంలో భారీగా పోతులూరి వీరబ్రహ్మం శోభాయాత్ర జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ అంబేడ్కర్ భవన్ అధ్యక్షుడు వి.కల్యాణరావ్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ పాల్గొన్నారు.


