భూ భారతి సమీకృత పోర్టల్‌.. ఏ ప్రాంతంలో ఎంత ఫీజు? | Telangana Bhu Bharati Portal Available | Sakshi
Sakshi News home page

భూ భారతి సమీకృత పోర్టల్‌.. ఏ ప్రాంతంలో ఎంత ఫీజు?

Apr 2 2026 8:38 AM | Updated on Apr 2 2026 8:38 AM

Telangana Bhu Bharati Portal Available

ఐదు మండలాల్లో పైలట్‌గా అమల్లోకి..

ల్యాండ్‌ పోర్ట్‌ఫోలియో నుంచి రీఫండ్‌ స్టేటస్‌ వరకు అన్ని రకాల సమాచారం ఒకే చోట

ఏ ప్రాంతంలో ఎంత ఫీజు కట్టాలనేది సర్వే నంబర్ల వారీగా నిక్షిప్తం

ఈసీలకు దరఖాస్తులూ ఇక్కడి నుంచే

సర్వే, తప్పొప్పుల సవరణ, అప్పీల్, రిజిస్ట్రేషన్‌ సర్వీసులూ అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో మరో కీలక అడు గు. ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐడీఎల్‌ఆర్‌ఎంఎస్‌) పేరుతో భూభారతి సమీకృత పోర్టల్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేస్తూ రూపొందించిన ఈ కొత్త సమీకృత పోర్టల్‌ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో పైలట్‌ పద్ధతిలో ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఒక్క క్లిక్‌... సమస్త సమాచారం
భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమీకృత పోర్టల్‌ రూపకల్పనకు పూనుకున్నారు. కేవలం భూపరిపాలనకు సంబంధించిన సమాచారమే కాకుండా సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. మైల్యాండ్‌ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్లు, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల వివరాలు, ఫీడ్‌బ్యాక్, అధికారుల వివరాలు, ఆర్‌వోఆర్‌–1బీ, ఎల్‌పీఎం (భూదార్‌), దరఖాస్తులు, సిటిజన్‌ చార్టర్, డౌన్‌లోడ్స్, మ్యుటేషన్‌ ఆర్డర్లు, భూముల మార్కెట్‌ విలువలు, భూనక్షా, ధరణి కంటే ముందునాటి ఈసీలు, ఫీజుల రీఫండ్‌ వివరాలతో కూడిన 15 అంశాల డ్యాష్‌బోర్డును ఈ పోర్టల్‌లో రూపొందించారు. డ్యాష్‌బోర్డులోని ఒక్కో అంశంపై క్లిక్‌ చేస్తే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం లభ్యమవుతుందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఈ పోర్టల్‌లో ఐదు రకాల సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమాచారం, సర్వే, తప్పొప్పుల సవరణ, అప్పీల్, రిజిస్ట్రేషన్‌ సర్వీసులనూ ఈ పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
రాష్ట్రంలోని భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో, సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సమీకృత పోర్టల్‌పై అక్కడి నుంచే రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రైతులకు పారదర్శక, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ సమీకృత భూభారతి పోర్టల్‌ను తయారు చేశామన్నారు. ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తేవడం ద్వారా భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. 

భూసేవల కోసం రైతులు మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే పొందేవిధంగా పోర్టల్‌ను రూపొందించామని, భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ పోర్టల్‌లోకి రైతు లాగిన్‌ అయిన వెంటనే తన భూమికి సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయన్నారు. భూముల సర్వే కోసం చెల్లించాల్సిన ఫీజు వివరాలు, సర్వే పురోగతి, ఎల్‌పీఎం, భూదార్‌ నెంబర్‌ కేటాయింపు వివరాలు కనిపిస్తాయన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం వస్తుందని వివరించారు. ఈ పోర్టల్‌తోపాటు రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ జతచేసేలా భూభారతి చట్టంలో పేర్కొన్న నిబంధనను కూడా అమల్లోకి తెస్తున్నామని, పాత విధానాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహించే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement