Telangana: పారాక్వాట్‌ గడ్డిమందుపై సర్కార్‌ నిషేధం | Deadly Herbicide Paraquat Banned in Telangana | Sakshi
Sakshi News home page

Telangana: పారాక్వాట్‌ గడ్డిమందుపై సర్కార్‌ నిషేధం

Apr 2 2026 7:37 AM | Updated on Apr 2 2026 7:38 AM

Deadly Herbicide Paraquat Banned in Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్‌’ గడ్డిమందుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో పారాక్వాట్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చి, 60 రోజులపాటు రాష్ట్రంలో పారాక్వాట్‌ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ, వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉండనుంది. 

ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా పారాక్వాట్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రానికి ఉన్న పరిమిత అధికారాలను ఉపయోగించి రాష్ట్రంలో పారాక్వాట్‌ గడ్డిమందును పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు నం. 24 జారీ చేసింది. 

అత్యంత విషపూరితమైన గడ్డిమందు..
పారాక్వాట్‌ గడ్డిమందు వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, ఇతర కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది అత్యంత విషపూరితమైనది. ఈ మందు పొలాల్లో పిచికారీ చేసే సమయంలో చర్మంపై లేదా కళ్లలో పడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. క్షణికావేశంతో ఆత్మహత్యకు పా­ల్పడాలనే నిర్ణయం తీసుకొనే వాళ్లతో పాటు ప్రమాదవశాత్తు దీనిని తాగడం వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 1,167 మరణాలు నమోదయినట్లు వైద్య ఆరోగ్య­శాఖ వెల్లడించింది. 

ఈ మందు మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుండడంతో రాష్ట్రంలో పారాక్వాట్‌ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ, వినియోగంపై తక్షణ నిషేధం విధించినట్లు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ గడ్డిమందు అమ్మకాలు నిర్వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement