ఈనాడుకు నాంపల్లి కోర్టు నోటీసులు | Nampally Court Sends Notices To Eenadu Newspaper | Sakshi
Sakshi News home page

ఈనాడుకు నాంపల్లి కోర్టు నోటీసులు

Apr 2 2026 7:28 AM | Updated on Apr 2 2026 10:50 AM

Nampally Court Sends Notices To Eenadu Newspaper

సాక్షి,  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు  కంప్లైంట్స్‌ అథారిటీ ‘ఈనాడు’ దినపత్రికపై దాఖలు చేసిన ప్రైవేట్‌  కంప్లైంట్‌ను నాంపల్లిలోని మొదటి అడిషినల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు (ఎస్టీసీ  ఎస్సార్‌ నెం.11/2026) ఆధారంగా ‘ఈనాడు’ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గురువారం పిటిషన్‌ను న్యాయస్థానం మరోసారి విచారించనుంది. 

ఆ పత్రికలో ప్రచురితమైన ఓ కథనానికి సంబంధించిన వివరాలను అథారిటీ కోరినా సంస్థ స్పందించకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్‌ కంప్‌లైట్‌ ఫైల్‌ చేసింది.  గత ఏడాది ఆగస్టు 17న ‘ఈనాడు’లో ‘షాడో నేత... వసూళ్ల మేత’ శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది. రాష్ట్ర, జిల్లా అథారిటీలు ఆ కథనంలోని అంశాలను చర్చించి, ఆ అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించాయి. హైదరాబాద్‌ రీజియన్‌కు సంబంధించిన జిల్లా పోలీసు కంప్‌లైట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ సెషన్స్‌ జడ్జ్‌ కె.సుదర్శన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాయి. 

అదే కథనంలో ముగ్గురు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ (డీసీపీ) ర్యాంకు అ«ధికారులకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ముగ్గురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడానికి  కంప్లైంట్స్‌  అథారిటీ నిర్ణయించింది. దీంతో ఆ కథనానికి సంబంధించిన ఆ«ధారాలు, రిపోర్టర్‌ వివరాలు, వార్తకు సంబంధించిన ఒరిజినల్‌ కాపీ, రిపోర్టర్‌ అఫిడవిట్‌ తదితరాలను తమకు అందించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 29న స్పీడ్‌ పోస్టు ద్వారా ‘ఈనాడు’ ఎడిటర్, పబ్లిషర్‌కు లేఖ రాసింది.  సెపె్టంబర్‌ 1న లేఖ అందినట్లు గుర్తించింది. అయితే వివరాలను అందించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ‘ఈనాడు’కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

 గత ఏడాది నవంబర్‌ 12న వీటిని జారీ చేసినప్పటికీ బాధ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జనవరి 2న నాంపల్లిలోని ఫస్ట్‌ అడిషినల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ప్రైవేట్‌  కంప్లైంట్స్‌  దాఖలు చేసింది.  పత్రిక ఎడిటర్, పబ్లిషర్‌గా ఉన్న డీఎన్‌ ప్రసాద్‌పై ప్రాసిక్యూషన్‌ చేసి, చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌తో పాటు ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం, తాము పంపిన లేఖ, షోకాజ్‌ నోటీసులు తదితరాలను సంబంధించిన ప్రతుల్ని జత చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎన్‌.శ్రీకాంత్‌ బాబు ప్రతివాదుల వ్యక్తిగత హాజరుకోరుతూ నోటీసులు జారీ చేశారు.      

Advertisement
 
Advertisement
Advertisement