వేసవి కబురు చల్లగా! | IMD releases summer season forecast for April-June | Sakshi
Sakshi News home page

వేసవి కబురు చల్లగా!

Apr 2 2026 3:15 AM | Updated on Apr 2 2026 3:15 AM

IMD releases summer season forecast for April-June

రాష్ట్రంలో వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణమే

సాధారణ స్థితిలోనే నమోదయ్యే అవకాశం

ఈసారి హీట్‌వేవ్‌ రోజులు కూడా తక్కువే

దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే హీట్‌వేవ్‌లు

ఏప్రిల్‌–జూన్‌ వేసవి సీజన్‌ అంచనాలు విడుదల చేసిన ఐఎండీ

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సీజన్‌పై ఐఎండీ చల్లని వార్త చెప్పింది. ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్‌– జూన్‌ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్‌ అంచనాలను బుధవారం వాతావరణ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం, అంతకంటే తక్కువగా నమోదవుతాయని వివరించింది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని తెలిపింది. దీంతో పగటి పూట సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ రాత్రి వేళ మాత్రం ఉక్కపోత ప్రభావం ఉంటుందని తెలిపింది. 

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే... ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవు తాయని, రెండు, మూడు తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఏప్రిల్‌ నెలలో సాధా రణ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని పశ్చిమ ప్రాంత జిల్లాల్లో సాధారణం కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు మధ్య తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉంటాయని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం, కాస్త ఎక్కువగా ఉండొచ్చని వివరించింది.

హీట్‌వేవ్‌ తక్కువే...: ప్రస్తుత వేసవి సీజన్‌లో రాష్ట్రంలో హీట్‌వేవ్‌ రోజులు తక్కు వగానే ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. గత మూడేళ్లుగా హీట్‌వేవ్‌ రోజులు తగ్గుతూ వచ్చాయి. 2024 వేసవి సీజన్‌లో 22 రోజుల పాటు వడగాలులు నమోదు కాగా గతేడాది కేవలం 10 రోజులు మాత్రమే నమోదయ్యాయి. ముందస్తు వర్షాలతో గత వేసవి సీజన్‌లో వరుసగా చాలా రోజులు వాతావరణం చల్లగా ఉంది. ప్రస్తుత సీజన్‌లో కూడా హీట్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమేనని, గరిష్టంగా 5 నుంచి 10 రోజుల్లోపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 

నెలవారీగా వర్షపాతం గణాంకాలతో పోలిస్తే ఈసారి ఏప్రిల్‌–జూన్‌ నెలల్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బుధవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 21.4డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి,. 

Advertisement
 
Advertisement
Advertisement