ఎన్నికల ప్రచారంలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి పొంగులేటి
కేరళ సీఎం విజయన్, ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
వారిద్దరినీ ఓడిస్తేనే కేరళకు మంచి రోజులు
లెఫ్ట్ ఫ్రంట్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే..
కేరళలో రేవంత్ ఎన్నికల ప్రచారం
సీఎంవ్యాఖ్యలను తప్పుబట్టిన కూనంనేని
సాక్షి, హైదరాబాద్: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ, తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఓడగొడితేనే కేరళకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ–విజయన్‌లవి విభిన్న భావజాలాలైనా, భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్– బీజేపీ మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కేరళలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రివేండ్రం, నేమం, భరతన్నూర్, అలెప్పీ, కాయకుళం నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కేరళ సీఎం పినరయి విజయన్‌ను ప్రధాని మోదీతో పోల్చారు. ప్రధాని మోదీకి, కేరళ సీఎం విజయన్‌కు తేడా ఏమీ లేదని, విజయన్ ద్వారా కేరళ భవిష్యత్తును అపహరించాలని మోదీ చూస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఓటు బ్యాంకు విజయన్‌కు బదిలీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ మాత్రమేనని అన్నా రు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, విజయన్‌సర్కారుపై ఈగ కూడా వాలనీయదని ఆరోపించారు. కేరళ సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు.
మలయాళంలో పలకరింపు
గత పన్నెండేళ్లుగా ఢిల్లీలో... పదేళ్లుగా కేరళలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోదీ, కేరళలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్‌గా నిలిచారని ధ్వజమెత్తారు. ఇరువురి సిద్ధాంతాలు వేరైనా వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతోందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళ కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేరళ అభివృద్ధికి రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని, వారిద్దరూ కేరళ కుటుంబ సభ్యుల్లా మారారని తెలిపారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ఓ సినిమాలో చెప్పిన ’నీ పో మోనే.. దినేశా..’ తరహాలో ’నీ పో మోనే విజయన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్’ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ మలయాళంలో పలకరించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాత్రికి ఎర్నాకులంలో బస చేసిన రేవంత్ గురువారం కూడా కేరళ ప్రచారంలో పాల్గొననున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రేవంత్‌తో కలిసి రోడ్‌షోలకు హాజరయ్యారు.
కూనంనేని ఆక్షేపణ
కేరళ సీఎం, మార్క్సిస్టు నేత పినరయి విజయన్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ తప్పుపట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విధానాలపై రేవంత్ విమర్శలు చేయొచ్చు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైంది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. మోదీని విమర్శించవచ్చు కానీ, విజయన్‌ను మోదీతో పోల్చడం కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములనే విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని కూనంనేని వ్యాఖ్యానించారు.


