breaking news
Bhu Bharathi Portal
-
అంతులేని దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చలాన్ల ఎడిటింగ్ ద్వారా రూ. 50 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో మరిన్ని విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి తదితర జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంపై ఆరా తీసేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఆడిట్లో రెండు రకాల ప్రధాన లావాదేవీల్లో తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకే రిజిస్ట్రేషన్ కోసం రెండు చలాన్లు కట్టే వెసులుబాటు ఉండటంతో తక్కువ మొత్తంలో కట్టిన చలాన్‌ను ప్రభుత్వానికి చెల్లించి ఎక్కువ మొత్తంలో కట్టిన చలాన్‌ను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మరల్చుకున్నారని ఆడిట్లో తేలినట్లు సమాచారం. అలాగే సేల్డీడ్ల రిజిస్ట్రేషన్ తర్వాత వాటిని రద్దు చేసుకున్నట్లు చూపి క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 2 వేలు చెల్లించి అంతకుముందు చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను కొనసాగిస్తున్నారా అనే సందేహం కూడా ఈ పరిశీలనలో తలెత్తింది. అయితే ఈ రెండు అంశాల్లో ఏ మేరకు ఏం జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు అంశాల్లో తేడాలున్న లావాదేవీల వివరాలను తహసీల్దార్లకు పంపి వివరణ కోరారు. ఒకవేళ తాజా ఆడిట్లో తేలిన ఈ రెండు అంశాల్లోనూ దోపిడీ జరిగినట్లు తేలితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. నాలుగు స్థానాలు... మూడు కోణాలు తాజా కుంభకోణం వెనుక నాలుగు స్థానాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, పోర్టల్ ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది పాత్రతోపాటు తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, సిబ్బంది కుమ్మక్కు అనే మూడు కోణాల్లో దర్యాప్తు వేగవంతమవుతోందని.. స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు మిగిలిన చోట్ల జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో 4–5 రోజుల్లో అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని అంటున్నాయి. అయితే చలాన్ల ఎడిటింగ్ ద్వారానే అక్రమాలు జరిగాయన్నది ఉన్నతాధికారుల ప్రాథమిక అభిప్రాయమైనప్పటికీ అలా జరిగి ఉండకపోతే మాత్రం ఏకంగా పోర్టల్‌ను హ్యాక్ చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చలాన్... ఎనిమిది ప్రశ్నలు 1 ఇష్టారాజ్యంగా స్లాట్ల బుకింగ్‌కు అనుమతి ఎలా? గతంలో ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ కుంభకోణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రయ, విక్రయదారులతో సంబంధం లేని ఫోన్ నంబర్లతో స్లాట్లు బుక్ చేసి, ఆ స్లాట్ ఐడీల ఆధారంగానే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకే ఫోన్ నంబర్‌పై 70 నుంచి 100 వరకు స్లాట్లను బుక్ చేసినట్లు సమాచారం. 2 ఆ ఉద్యోగులనే ఎందుకు కొనసాగించారు? ధరణి పోర్టల్‌ను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించగా భూభారతి పోర్టల్‌ను ఎన్ఐసీకి అప్పగించారు. అయితే అప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది వారే కావడం కూడా ఈ అక్రమాలు కొనసాగేందుకు ఊతమిచ్చిందన్న చర్చ నడుస్తోంది. వేతనాలు తక్కువగా ఉండే పోర్టల్ ఆపరేటర్లలో 60 శాతం మంది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసి అదనపు ఆదాయం పొందుతుండటంతో మీ–సేవా కేంద్రాల నిర్వాహకులతోపాటు ఆపరేటర్ల పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. 3 ఎడిట్ చేశారా.. హ్యాక్ చేశారా? స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించేటప్పుడే చలాన్లను ఎడిట్ చేసినట్లు అధికారులు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మీ–సేవా నిర్వాహకులు లేదా ఆపరేటర్లు కట్టిన చలాన్లను సీసీఎల్ఏ కార్యాలయ సర్వర్ వద్ద ఉండే సిబ్బంది ఎడిట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలా జరగాలంటే మీ–సేవా, ధరణి ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది కుమ్మక్కు కావాల్సి ఉంటుందని.. అది సాధ్యం కాదనుకుంటే చలాన్ దోపిడీ జరిగినప్పుడల్లా రిజిస్ట్రేషన్ పోర్టల్‌నే హ్యాక్ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. 4 తహసీల్దార్లు ఏం చేస్తున్నట్లు? అసిస్టెంట్ సబ్‌రిజిస్ట్రార్ హోదాలో ఉండే తహసీల్దార్లకు కేవలం భూమి వివరాలు, క్రయ, విక్రయదారుల వ్యక్తిగత వివరాలు సరిచూసుకునే బాధ్యత తప్ప ప్రభుత్వానికి అందాల్సిన మొత్తాన్ని చెక్ చేసే వ్యవస్థ వారి వద్ద లేదని.. ధరణి పోర్టల్ నుంచే ఇది కొనసాగుతున్నప్పటికీ భూభారతి అమల్లోకి వచ్చినా కూడా దీన్ని మార్చలేదని తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ చేసిన వారు ప్రింట్ రూపంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు జత చేసే చలాన్ జిరాక్స్‌ను చూసి తహసీల్దార్లు ఎలా సంతకాలు పెట్టారన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. 5 తనిఖీ వ్యవస్థ లేదా? సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఓ ఉద్యోగి చెక్ చేసి సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌రిజిస్ట్రార్ ఆయా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీజు, చలాన్ అంశాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్‌కు పంపుతారు. కానీ వ్యవసాయ భూముల విషయంలో ఒకసారి స్లాట్ బుక్ అయిన డాక్యుమెంట్ నేరుగా తహశీల్దార్లకే వెళ్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ప్రింట్ తీశాకే చలాన్ ఎంత కట్టారన్నది రివర్స్ ఎండార్స్మెంట్లో కనిపిస్తోంది. 6 అప్పుడైనా చూడాలి కదా? తహసీల్దార్లు పనిఒత్తిడి వల్ల రివర్స్ ఎండార్స్మెంట్లో ఎంత చలాన్ వచ్చిందో చూడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని.. ఇది కచ్చితంగా వారి నిర్లక్ష్యమేనని దర్యాప్తు కమిటీ భావిస్తోంది. అలాగే తహసీల్దార్లకు తెలిసే ఇదంతా జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 7 ఫీజు ఎంత కడతారో తెలియదా? వ్యవసాయ భూములను గత ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దార్లకు ఎంత భూమి రిజిస్ట్రేషన్‌కు ఎంత ఫీజు కడతారో కూడా తెలియదని.. 60 శాతం మంది తహసీల్దార్లు ఆఫీసు సిబ్బందిపైనే ఆధారపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఏ డాక్యుమెంట్లో ఏం రాశారో కూడా వారికి అర్థమయ్యే పరిస్థితి లేదని.. ఒకవేళ అర్థమైనా అలా చూసే తీరిక లేదని అంటున్నాయి. 8 లావాదేవీలను ఆడిట్ చేయలేదా? సాగు భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సంబంధించి గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రవ్యాప్త ఆడిట్ జరగలేదని, అలా జరిగి ఉంటే ఎక్కువగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిన 2021, 2022లోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేదని తెలుస్తోంది. ‘నాలా’ఫీజు పెంపు గురించి వారికి 8 నెలల దాకా తెలియదట! గతంలో ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉండేదని తహసీల్దార్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి (నాలా) ఫీజును 3 శాతం నుంచి 5 శాతానికి పెంచిన విషయం 7–8 నెలల వరకు తమకు తెలియలేదని వారంటున్నారు. నాలా ఫీజు కింద ఎంత భూమికి ఎంత చలానా కట్టాలో కూడా తమకు తెలిసే పరిస్థితి ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఇక సాధారణ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఫీజు ఎంత కట్టాలో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏముందో అరకొర శిక్షణ ఇస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా వసూలు చేస్తాం ‘ఇష్టానుసారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకే గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. కనీసం చలాన్ ఎంత కట్టారో కూడా సరిచూసుకోలేని విధంగా సాంకేతికతను సమకూర్చింది. తహసీల్దార్లకు సరైన శిక్షణ ఇవ్వకపోగా ఆడిట్ వ్యవస్థకు దిక్కేలేదు. ధరణి పోర్టల్ స్థానంలో మేం తెచ్చిన భూభారతి పోర్టల్‌కు సాంకేతిక సత్తువ సమకూర్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ధరణి దరిద్రాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా తిరిగి తీసుకుంటాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ – మంత్రి పొంగులేటి -
చలాన్లలో తొండి.. ఖజానాకు గండి
సాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ: భూ భారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది. భూ భారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి 22 కేసులు బయటపడగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ కుంభకోణం కొనసాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న తంతు వెనుక ఓ ముఠా ఉందని, హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్‌కు అనుమానం రాకుండా.. వివిధ భూ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. కానీ యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్‌ను ఎడిట్ చేసే విధానాన్ని రూపొందించి, తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తంలో 10 శాతం కన్నా కూడా చాలా తక్కువకే (ఉదాహరణకు రూ.1.39 లక్షల చలాన్‌కు రూ.1,039) చలాన్ తీసి మిగిలిన మొత్తాన్ని తన జేబులో వేసుకున్నట్లు సమాచారం. ఎడిటింగ్ ఇలా.. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే దశలో తహసీల్దార్‌కు సైతం ఎలాంటి అనుమానాలు రాకుండా చలాన్ పూర్తి మొత్తంతో చెల్లించినట్లుగా చూపిస్తూ ఈ దందా కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక యాప్‌తో చలాన్ తీసేటప్పుడు సంబంధిత రుసుమును ఎడిట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. దీంతో పేజీ స్లాట్ బుకింగ్‌కు వెళుతుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించడంతో పాటు తహసీల్దార్ లాగిన్‌లో స్లాట్ బుక్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అయితే ఈ విషయం భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులకు తెలియదు.ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. జిల్లాతో పాటు జనగామలో కొందరు ఆపరేటర్లకు చిన్న మొత్తంలో కమీషన్ ఇవ్వడం ద్వారా వారిని ఈ అక్రమాల్లోకి లాగేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడగా, మొత్తం సంఖ్య 45 దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి పోర్టల్‌లో కూడా ఇలాంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇదే ముఠా మోసాలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనగామలో కదిలిన డొంక.. ఇలాంటి ఘటనలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జనగామ పోలీసులు విచారణ ప్రారంభించారు. వరంగల్ పోలీసులు మాస్టర్‌మైండ్‌గా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కాగా.. చలాన్ ఎడిటింగ్ గ్యాంగ్ సైతం పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా లోపాలున్నాయా అన్నదే పరిశీలించామని చెప్పారు. చలాన్ దందా లాంటి విషయం ఏమీ లేదు కదా? అని కలెక్టర్ అన్నారు.అయితే పోలీసుల విచారణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ భారీ కుంభకోణం రాష్ట్రంలో ఎంతవరకూ వ్యాపించిందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో కూడా ఇదే రకం అక్రమాలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. భూముల సంబంధిత ఎల్రక్టానిక్ ఎంట్రీలను ఉద్దేశపూర్వకంగా మార్చి అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు జనగామ పోలీసులు గత మూడు రోజులుగా కూపీ లాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. -
దరి చేరని 'ధరణి' కష్టం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయిన రైతుల సమస్య ఏళ్లు గడిచినా తీరడం లేదు. ఎప్పుడో కట్టిన చలాన్ల డబ్బులు వాపస్ కూడా రావడం లేదు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారమే ఇంకా 27 వేల మంది రైతుల విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఇంకా దరఖాస్తు చేసుకోనివారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో వివరణ ఇచ్చిన ప్రకారమే ఇంకా రూ.87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో ఉండిపోవడం గమనార్హం. ధరణి కష్టం.. భూభారతిలోనూ కలగని మోక్షం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూములను కూడా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభించారు. ఈ భూముల క్రయ విక్రయాల కోసం రైతులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలోనే సదరు భూమి రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ చలాన్ (డీడీ) రూపంలో ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్నా..ఒకవేళ అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వెళ్లలేకపోతే ఆ డీడీలను వెంటనే నగదు రూపంలోకి మార్చుకునేవారు. కానీ ధరణి పోర్టల్‌లో ఒకసారి కట్టిన చలాన్లను నగదు రూపంలోనికి మార్చుకునే ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వారి డబ్బులు అలాగే ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి. ఈ డబ్బుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ డబ్బు చెల్లించే అధికారం తమకు లేదంటూ తహశీల్దార్ల నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు చేతులెత్తేశారు. దీంతో కొందరు కోర్టుకు వెళ్లి తమ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో చలాన్లను నగదు రూపంలోకి మార్చుకునే ఆప్షన్ ఇవ్వడంతో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకునే వారికి తహశీల్దార్ల ప్రొసీడింగ్స్‌తో సీసీఎల్ఏ కార్యాలయం ద్వారా నగదు రూపంలోకి మారుస్తున్నారు. అయితే డీడీలు తీసిన ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే, ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న వారి నగదు విషయంలో మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఆ దరఖాస్తులు పరిష్కరించరా? తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31,314 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, అందులో 4,574 దరఖాస్తులను పరిష్కరించి రూ.12.97 కోట్లను రైతులకు చెల్లించారు. కానీ మరో 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించి తమ డబ్బులను తమకు ఇప్పించాలని కోరుతూ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయా చలాన్లను నగదు రూపంలోకి మార్చే అధికారం సీసీఎల్ఏకు కట్టబెట్టడంతో సదరు ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ డబ్బులను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. -
భూ చిక్కులకు భూభారతి చెక్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభించనుందని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్దుతూ ప్రస్తుత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, సమావేశాల్లో లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి.సర్వే నంబర్లు, ఇంటి పేరు, భూ యజమాని పేరు తప్పుగా ఉండటం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, సర్వే నంబర్లు మిస్ కావడం, సాదాబైనా మా, మ్యుటేషన్, అసైన్డ్ ల్యాండ్ పట్టా, వారసత్వ పట్టా వంటివి దాదాపు 20 కేటగిరీల్లో దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా సాదాబైనామా, అసైన్డ్ భూముల దరఖాస్తులే ప్రభుత్వానికి వచ్చాయి.సాదాబైనామాలపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఇటీవల తొలగించడంతో తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలు చేసిన రైతులకు ఊరట లభించనుంది. 1969 నుంచి పేదలకు అసైన్డ్ భూములను కేటాయిస్తుండగా లబ్ధిదారులు విక్రయించడానికి వీల్లేకుండా 1977లో అప్ప టి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పీఓటీ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ చాలామందికి అవగాహన లేక భూములు చేతులు మారాయి. ఈ సమస్య పరిష్కారానికి కూడా భూభారతి చట్టం దారి చూపనుంది. ఇప్పటికే అమ్మకం, కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేయగా త్వరలోనే జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించనున్నారు. రెవెన్యూ వ్యవస్థకు జవసత్వాలు భూముల సమస్యల పరిష్కారానికి ఉన్న చట్టాల అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం. గతంలో మండలానికి ఒకే ఒక్క సర్వేయర్, వీఆర్ఏ, వీఆర్వో దరఖాస్తులు పరిశీలించేవారు. 2020లో అప్పటి ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో దరఖాస్తుల పరిష్కారం క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉద్వాసనకు గురైన 5,101 మంది వీఆర్ఏ, వీఆర్ఓలను జీపీఓ (గ్రామ పాలనాధికారులు)లుగా నియమించింది. అలాగే 7 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు జారీ చేసింది. మరికొంత సమయం.. భూభారతి ద్వారా భవిష్యత్తులో భూవివాదాలు, ఘర్షణలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. సాదాబైనామాలో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరుగుతుండగా భూమిపై ఒకరు, రికార్డుల్లో మరొకరు యజమానిగా ఉంటున్నారు. భూమి మీద ఉన్న వ్యక్తి క్రమబద్ధికరించాలని భూభారతిలో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పరిష్కారానికి కొంత సమయం పట్టనుంది. అలాగే అసైన్డ్ భూముల విషయంలోనూ విక్రయదారు, కొనుగోలుదారులను పిలిపించి ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. పరిష్కారంపై ఆశతో ఉన్నా.. వారసత్వం కింద నాలుగు ఎకరాలు రాగా.. మరో నాలుగున్నర ఎకరాల భూమి కొన్నా. కొనుగోలు చేసిన భూమి హక్కుల కోసం 2020లో సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నా. తహసీల్ చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు. తాజాగా కోర్టు తీర్పుతో పరిష్కారంపై ఆశతో ఉన్నా. – బంధం వెంకటేశ్వర్లు, ముష్టికుంట్ల, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా పాస్ పుస్తకంలో నమోదు చేయాలి.. రంగపేటలో వెల్ది శివారు సర్వే నంబర్ 698ఎ/2/1లో 5.07 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం డీబీఎం–6 కాలువ కోసం ఎకరం 11 గుంటలు తీసుకోగా మిగిలిన 3.36 ఎకరాలకుగాను 2.15 ఎకరాలనే రికార్డుల్లో నమోదు చేశారు. మోకాపై పరిశీలించి నా పేరిట చేయాలని ఐదేళ్లుగా తిరుగుతున్నా. భూభారతితోనైనా సమస్య పరిష్కరించాలి. – మర్రి మల్లారెడ్డి, మానకొండూరు, కరీంనగర్ జిల్లా మూడేళ్లుగా తిరుగుతున్నా.. ఒక ఎకరం 35 గుంటల భూమి పీఓబీలో పడింది. నా భూమికి సమీపాన దేవాదుల కాల్వ ఉండటం వల్ల నా భూమిని పీఓబీలో పెట్టారు. మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇకనైనా నా భూమిని పీఓబీ నుంచి తొలగించి ఆదుకోవాలి. – బానోతు హరిలాల్, ఆల్వార్ బండ తండా(శంకర్ తండా), జఫర్‌గఢ్, జనగామ జిల్లా భూ భారతితో సమస్యలు పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు ధరణి పోర్టల్‌తో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలన్నీ భూభారతితో పరిష్కారమవుతాయి. జీపీఓల నియామకంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుంది. త్వరలో చేపట్టే సమగ్ర భూసర్వేతో అన్ని రకాల సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం లభిస్తుంది. – గరికె ఉపేంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు, జీపీఓల సంఘం క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి నేను యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్/వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. అంతకుముందు 12 ఏళ్లపాటు రెవెన్యూ శాఖలో పని చేశా. వీఆర్వో వ్యవస్థ రద్దుతో మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరా. మేం తిరిగి రెవెన్యూలోకి వస్తామనుకోలేదు. అలాంటిది జీపీఓగా రావడం ఆనందంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. – తోకల శిరీష, గంధమల్ల, తురకపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా (జీపీఓ, సిద్దిపేట జిల్లా) -
అటూ ఇటుగా.. ఆరు నెలలు
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాల క్రమబద్ధికరణ విషయంలో హైకోర్టులో ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఈ దరఖాస్తుల పరిధిలో ఉంటుందని, ఈ మేరకు ఆ భూములన్నింటికీ త్వరలోనే విముక్తి లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి అటూఇటుగా ఆరునెలల సమయం పట్టే అవకాశముంది. భూభారతి పేరుతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం ప్రకారం ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. రెవెన్యూ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...! ⇒ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సాదాబైనామాల ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి తొలుత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ⇒ ఈ నోటిఫికేషన్ మేరకు పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుదారులకు, సాదాబైనామాల ద్వారా ఆ భూమిని అమ్మిన వారికి ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల జారీకి కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంచనా. ⇒ ఈ నోటీసుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ భూమికి సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న సాదాబైనామా లావాదేవీ సరైందా లేదా అన్నది పరిశీలించడంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ⇒ అప్పుడు సదరు భూమిని అమ్మింది, కొన్నది వాస్తవమే అని తేలితే ప్రత్యేక ఆర్డర్ ఇచ్చి రిజి్రస్టేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ కట్టి క్రమబద్ధికరించుకునే అవకాశం కల్పిస్తారు. ⇒ అలా స్టాంపు డ్యూటీ కట్టిన తర్వాత ఓ సర్టీఫికెట్ ఇస్తారు. ఈ సరి్టఫికెట్‌ను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ దీని ఆధారంగా ఆ భూమికి పాసు పుస్తకాలు వస్తాయి. ఈ సరి్టఫికెట్ ద్వారానే క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయి. ⇒ గతంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఉచితంగా చేసేవారు. కానీ, భూభారతి చట్టంలో మార్చిన నిబంధన ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ⇒ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2020లో దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు 13సార్లు సాదాబైనామాలను క్రమబద్ధికరించారు. 2020లో 14వ సారి జారీ చేసిన సాదాబైనామా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్రక్రియకు మోక్షం కలగనుంది. ⇒ దీని తర్వాత సాదాబైనామాల క్రమబద్ధికరణకు ఆస్కారం ఉండదు. ఈ మేరకు భూభారతి చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన తర్వాత మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకునే వీల్లేదని పేర్కొన్నారు. మళ్లీ సాదాబైనామాల క్రమబద్ధికరణ చేపట్టాలనుకుంటే ఆ చట్టాన్ని సవరిస్తే కానీ సాధ్యం కాదు. కోర్టు నిర్ణయం సంతోషకరంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సమావేశాల్లో కూడా ఈ సాదాబైనామాలపై చాలాసార్లు చర్చించాం. అయితే, గతంలో అమల్లో ఉన్న ధరణి చట్టంలో సాదాబైనామాల పరిష్కార నిబంధనను పొందుపర్చలేదు. దీంతోనే కోర్టు కొట్టివేసింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో ఆ నిబంధన పెట్టాం. ఇప్పుడు ఇదే నిబంధన ఆధారంగా కోర్టు సానుకూల తీర్పునిచ్చింది. ఇప్పటికైనా దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. – భూమి సునీల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు -
సర్వే నంబర్లు గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్‌ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండడంతో అవి రెగ్యులరైజ్ చేసేందుకు వీలు కాలేదు. కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వారసత్వం (విరాసత్) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యుటేషన్ పెండింగ్/కోర్టు కేసులు, డిజిటల్ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్‌లో తక్కువ జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ తర్వాత వరంగల్ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్ (3,712), మహబూబ్‌నగర్ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం. – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (నోట్: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్‌బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.) -
ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: రికార్డులో ఒక సర్వేనంబర్ ఉంటుంది.. భూమి మరో సర్వే నంబర్లో ఉంటుంది.. పాసు పుస్తకంలో ఉండే సర్వే నంబర్‌కు, రైతు కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్‌కు పొంతనే ఉండదు. తెలంగాణలోని చాలా వ్యవసాయ భూముల పరిస్థితి ఇదే. ఇప్పుడీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ వ్యవస్థలో నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రైతుకు ఇష్టమైతే పాస్ పుస్తకంలోని సర్వే నంబర్‌ను మార్చి కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్‌ను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాతదే అయినా.. పట్టించుకోలేదు: దశాబ్దాల తరబడి తెలంగాణలో భూముల సర్వే జరగని కారణంగా సర్వే నంబర్లు తప్పుగా నమోద యినా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఏ సర్వే నంబర్ అయితే ఏముందిలే... ఉన్న భూమి రికార్డులో ఉంటే చాలంటూ రైతులు కూడా ఆ సమస్యను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేపడుతోంది. గ్రామ నక్షాలు లేని 413 గ్రామాలను గుర్తించిన ప్రభు త్వం.. 5 గ్రామాల్లో పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు పూనుకుంది. ఈ రీసర్వేలో సర్వే నంబర్ల సమస్య వెలుగులోకి వచ్చింది. రీసర్వే జరు గుతున్న సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 32 మండలాల్లో భూభారతి చట్టాన్ని పైలట్‌గా అమలు చేస్తూ రైతుల భూసమ స్యలపై దరఖా స్తులు తీసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల్లోనూ సర్వే నంబర్ల మార్పిడి విజ్ఞాపనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుకు ఇష్టమైతే తన పాసుపుస్తకంలోని సర్వే నంబర్‌ను మార్చాలని నిర్ణయించింది.అందరికీ తెలిసేలానే మార్పు..రికార్డుల్లో సర్వే నంబర్ల మార్పు కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూమి ఓ సర్వే నంబర్లో ఉండి రికార్డుల్లో మరో సర్వే నంబర్ ఉంటే.. ఆ రెండు సర్వే నంబర్లలోని రైతుల్లో ఎవరైనా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది. అప్పుడు రెండు సర్వే నంబర్లలోని రైతులకు వారం రోజుల నోటీసును రెవెన్యూ యంత్రాంగం ఇస్తుంది. ఆ వారం రోజుల్లో అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తుంది. లేదంటే గ్రామసభ పెట్టి అక్కడే రైతుల నుంచి సంతకాలు తీసుకుని వారిద్దరి సర్వే నంబర్లలోని రికార్డులను మార్పు చేసి వాస్తవంగా కబ్జాలో ఉన్న సర్వే నంబర్‌ను పాస్‌బుక్‌లో చేరుస్తారు. ఈ సర్వే నంబర్ సమస్య ఒకే రైతుకు ఉంటే ఆ రైతుకు నోటీసు ఇచ్చి ఆ తర్వాత రికార్డు మారుస్తారు. అయితే, ఇక్కడ సర్వే నంబర్‌ను మాత్రమే మారుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి విస్తీర్ణం మార్చబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. -
‘భూభారతి పేద రైతులకు చుట్టం’
హైదరాబాద్: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఈ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. ఈరోజు(మంగళవారం) అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నా. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి.. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి’ అనిముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. -
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్/నాగిరెడ్డిపేట/లింగంపేట (ఎల్లారెడ్డి)/ నేలకొండపల్లి: భూభారతి చట్టం అమలులో అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. భూభారతి చట్టంపై వరంగల్ నగరం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దే పల్లిలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లా డారు. ‘భూభారతి చట్టం అమలులో భాగంగా నాలుగు పైలట్ మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు బుధవారంతో ముగుస్తాయి. మే 5 నుంచి ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తాం. జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామా నికి అధికారులే వచ్చి సదస్సులు పెట్టి మీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు’అని ప్రకటించారు. 15 రోజుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు : మరో 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,986 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 320 మంది సర్వేయర్లు ఉండగా, వారి సంఖ్యను వేయికి పెంచుతామని చెప్పారు. మరో 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లను అందజేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3 వేల నుంచి 4 వేల మంది యువతకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను వచ్చేనెల 5వ తేదీలోపు మంజూరు చేస్తామని ప్రకటించారు. సుర్దేపల్లి సభలో కల్యాణలక్ష్మి లబ్ధిదా రులకు చెక్కులు అందజేసి, గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.విలువైన భూములు కొట్టేసేందుకే ధరణి తెచ్చారు : బీఆర్ఎస్ నాయ కులు రాష్ట్రంలోని విలువైన భూములను కొట్టేసేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎక్కడ చూసిన బీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసి అక్రమంగా పట్టాలు చేసుకొని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమస్యలను ఒక్క రూపాయి ఖర్చులేకుండా పరిష్కరించేందుకే భూ భారతి చట్టం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మదన్మోహన్రావు పాల్గొన్నారు.నా మనుమరాలిని చదివించండి సార్‘బడి ఫీజులు చెల్లించలేను సార్.. ఏదైన గురుకుల పాఠశాలలో నా మనుమరాలిని చదివించండి’అని ఓ వృద్ధురాలు పెట్టుకున్న వినతికి మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన ఊర్మిల వరంగల్ రెవెన్యూ సదస్సులో మంత్రికి ఈ మేరకు వినతిపత్రం అందించింది. మంత్రి సంబంధిత అధికారులను పిలిచి వినతిపత్రం అందజేసి సీటు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. -
ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి
నూతనకల్: రాష్ట్రంలో వివాద రహిత భూ విధానం తేవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దొర పాలనలో రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ధరణి పోర్టల్‌ను తెచ్చారని ఆరోపించారు. ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఎంతో మంది తమ భూములు పట్టా కాకపోవడంతో ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. ధరణి కష్టాలను తొలగించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని వివరించారు. నిషేధిత జాబితాలోని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం ధరణిలో తప్పిదాలు జరిగితే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయడానికి కూడా అధికారం లేకుండా గత పాలకులు చట్టాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు లాభం చేయడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఇచ్చే పాసు పుస్తకాల్లో సర్వే మ్యాప్ వివరాలు ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో ఏర్పడే సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వమే ఉచిత దరఖాస్తు ఫారాలను అందించి రైతుల పక్షపాతిగా నిలుస్తోందని తెలిపారు. భూమికి హద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తాం
కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు.ఖాజీపూర్ నుంచి సాక్షి ప్రతినిధిబీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘నాడు దొరవారు చేసిన ధరణి చట్టం పేద ప్రజలను, రైతులను పాతాళానికి తొక్కింది. ఇప్పుడు మేం తెస్తున్న భూభారతి చట్టం రైతుకు, భూమికి మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామాలు, గూడేలు, తండాల్లో ఉండే పేదలకు భరోసా, వారి భూములకు భద్రత ఉండేలా ఈ చట్టం తీసుకొస్తున్నాం’అని వివరించారు. పింక్ చొక్కాల కష్టాలూ తీరుస్తాం పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను 15 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్న అక్కసుతోనే ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. ‘వాళ్లు మమ్మల్ని తిట్టినా, ఆడిపోసుకున్నా సరే.. పింక్ చొక్కాలు వేసుకున్నవారి భూ సమస్యలను కూడా భూభారతి ద్వారా పరిష్కరిస్తాం. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి ధరణి పోర్టల్ వల్ల తమ పాసు పుస్తకాల్లో తప్పులు వచ్చాయని తెలిపారు.భారతికి బదులు భరత్‌రెడ్డి అని, 9 ఎకరాలకు బదులు 9 గుంటలు అని పడిందని, వాటిని కొత్త చట్టం ద్వారా సరిచేయాలని కోరారు. దేశానికి భూభారతి చట్టం రోల్‌మోడల్ కాబోతోంది. పింక్ చొక్కాలు వేసుకున్న వారు గతంలో పేదలకు చెందిన లక్షలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ఆ భూములన్నింటిని తీరిగి పేదలకు పంచాలనేది మా ఉద్దేశం. అసైన్డ్ భూములపై కూడా రైతులకు హక్కులు కల్పిస్తాం. కోర్టుల్లో లేని ప్రతి భూ సమస్యకు భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది’అని తెలిపారు. మంచిని మంచి అని చెప్పకపోయినా.. చెడుగా చిత్రీకరించొద్దు.. మా ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయనే అక్కసుతోనే మేం ఏం చేసినా అడ్డుకునే ధోరణితో ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయని పొంగులేటి విమర్శించారు. ‘కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు. మంచిని మంచి అని చెప్పకపోయినా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు.ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తన విధానం మార్చుకోకపోతే పార్లమెంటు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి’అని హెచ్చరించారు. సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌లు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన కౌంటర్లో రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ధరణి పోర్టల్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. తన భూమి పాసుపుస్తకంలో వాకిటికి బదులుగా వాకాటి అని వచ్చిందని, దానిని మార్చాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.తన నియోజకవర్గంలో ఇక నుంచి భూభారతి చట్టంలోని సెక్షన్ల గురించి రైతులకు వివరిస్తానని పేర్కొన్నారు. భూమి సునీల్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 1.30 కోట్ల మంది రైతుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టం మార్చామని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి పోర్టల్‌లో వచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. ఈ పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ భూమికి సంబంధించిన పాసుబుక్కు జారీ, భూమి క్రయ విక్రయ వివరాలను వెంటనే ఆన్లైన్లో మార్చటం వంటి అనేక వివరాలతో భూ భారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మార్గదర్శకాలతో పాటు చట్టం అమలును గెజిట్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ జీవో నం: 36, 39లను విడివిడిగా జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జీవో 39 ప్రకారం చట్టం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని తెలంగాణ భూభారతి నిబంధనలు (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)– 2025గా పిలుస్తారు. చట్టం అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. రికార్డుల తయారీ ఈ చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, మార్పు చేర్పులు, నిర్వహణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ రికార్డులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆబాదీతో పాటు వ్యవసాయేతర భూములను సర్వే చేయడం ద్వారా ఆయా భూముల హద్దులను అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా నిర్ధారించి మ్యాపులు రూపొందించాల్సి ఉంటుంది. వ్యవసాయ, ఆబాదీ, వ్యవసాయేతర భూముల రికార్డుల తయారీ, నిర్వహణ కోసం ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీచేసి మార్పులు, చేర్పులు చేయవచ్చు. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో పరిష్కారం తమ భూ రికార్డుల్లో తప్పులు నమోదైనా, హక్కుల రికార్డులో వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరంలోపు నిర్దేశిత ఫీజు చెల్లించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సవరణలు కోరవచ్చు. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్, పహాణీలు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లతో పాటు తాను చేసుకున్న దరఖాస్తు సరైనదేనని అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీవోలు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్స్‌కు రీఅప్పీల్ (మళ్లీ దరఖాస్తు) చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ వర్గాల నుంచి సంబంధిత వ్యక్తులకు నోటీసు వస్తుంది. ఈ నోటీసులపై సెకండ్ పార్టీ (దరఖాస్తుదారులు కాకుండా) వారం రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. లిఖిత పూర్వక అభ్యంతరాలు సమర్పించిన పక్షంలో నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ రిపోర్టుతోపాటు ఇరు పక్షాల నుంచి వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తారు. నేరుగా వారు వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సదరు అధికారి తగు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇదంతా నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఇలా.. ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ చేసుకునేందుకు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్‌ను సమయం (స్లాట్) అడిగితే, ఆ మేరకు తహసీల్దార్ స్లాట్ కేటాయిస్తారు. స్లాట్ ఇచ్చిన సమయంలో ఇరు పక్షాలు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా దరఖాస్తుదారుడు పేర్కొన్న వివరాలు హక్కుల రికార్డుతో సరిపోలాయా.. లేదా? ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉందా? అసైన్డ్ భూమినా? షెడ్యూల్డు ఏరియాలో ఉందా? అనే వివరాలను పరిశీలించి సదరు అధికారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే తహసీల్దార్ సంబంధిత రికార్డును కూడా భూభారతిలోమ మార్చాలి. ఈ వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను క్రయవిక్రయదారులిద్దరికీ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన పాసు పుస్తకం కూడా వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఈ చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులను జూన్ 2, 2014 నాటికి మార్చుకున్నవారు.. తమ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని 2020, అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి సాదాబైనామా నిజమా కాదా అనేది నిర్ధారించి తగు నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ భూమి సీలింగ్, షెడ్యూల్డు ఏరియా, పీఓటీ (అసైన్డ్) చట్టాల పరిధిలోనికి రానిదై ఉండాలి. ఒకవేళ సాదాబైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానిని వారం రోజుల్లోగా ఇరుపక్షాలకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీవోనే సదరు భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా నోటీసులిచ్చిన 90 రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. వారసత్వ భూములపై హక్కులు వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా వచ్చే భూములపై హక్కుల కోసం భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారసులందరూ అఫిడవిట్లు జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం వారసులందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసును గ్రామపంచాయతీలు, తహసీల్దార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా నోటీసులు జారీచేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదింపబడుతుంది. మ్యుటేషన్‌కు 30 రోజులు గడువు..! కోర్టు ఆదేశాలు, లోక్‌అదాలత్ తీర్పులు, రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, సీలింగ్, భూదాన్, 1977 అసైన్డ్ చట్టం కింద ఇచ్చిన భూములు, ఇనామ్‌ల రద్దు చట్టం కింద ఓఆర్సీ, రక్షిత కౌలుదారు చట్టం కింద యాజమాన్య సర్టిఫికెట్లు, ఇండ్ల స్థలాల రూపంలో ఇచ్చిన భూములకు మ్యుటేషన్ కోసం భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీవో నోటీసు ఇస్తారు. ఈ నోటీసు ప్రకారం ప్రత్యక్ష విచారణ లేదంటే రిపోర్టు తెప్పించుకోవడం ద్వారా డాక్యుమెంట్లను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది. ప్రతి భూ యజమానికి భూదార్ కార్డు భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్ కార్డులు జారీ చేస్తారు. పోర్టల్‌లో పేరున్న ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు జారీ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) ఇస్తారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు నిర్ణయించి ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త పాసు పుస్తకాల జారీ కొత్త పాసుపుస్తకాల కోసం కూడా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాల ఆధారంగా పాసుపుస్తకం కమ్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో నమోదై భూ యజమానులందరికీ తహసీల్దార్లు సుమోటోగా పాసు పుస్తకాలు ఇవ్వొచ్చు. దేనికైనా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హక్కుల రికార్డులో నమోదైన భూములను ఎప్పుడైనా లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోవచ్చు. ఈ సర్వే ద్వారా నిర్ధారించిన మ్యాప్‌ను పాసుపుస్తకాల్లో కూడా ముద్రించాల్సి ఉంటుంది. పాసు పుస్తకాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు భూభారతి పోర్టల్‌లో కల్పించారు. గ్రామ అకౌంట్ల నిర్వహణ గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. మ్యుటేషన్, రికార్డుల అప్డేషన్ జరిగినప్పుడు ఆ వివరాల ఆధారంగా అవసరాన్ని బట్టి గ్రామ పహాణీ, ప్రభుత్వ భూమి రిజిస్టర్, బదిలీ రిజిస్టర్, సాగునీటి సౌకర్యం రిజస్టర్లను మార్చాల్సి ఉంటుంది. ఏటా డిసెంబర్ 31 ఆర్ధరాత్రిలోపు గ్రామ అకౌంట్ వివరాలను సంబంధిత అధికారికి సమర్పించాలి. టైటిల్, కబ్జా, లేదంటే ఇతర సివిల్ అంశాల్లో ఎవరికి ఏ భూమిపై ఎలాంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. అప్పీళ్లతో పాటు రివిజన్ కూడా.. భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ వర్గాలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. దరఖాస్తును బట్టి 30 నుంచి 60 రోజుల్లోపు ఈ అప్పీళ్లను పరిష్కరించాలి. ఎవరైనా, ఏ భూమిపై అయినా మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే, ఆ భూమి గురించి భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సుమోటోగా కూడా అనుమానాస్పద భూములపై విచారణ చేపట్టవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పరిశీలించి అవసరమైతే సదరు భూమిని వెనక్కు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తోంది. ఉచిత న్యాయ సాయం.. పేద రైతులకు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు మండల, జిల్లా లీగల్ అథారిటీల సహకారంతో ఈ సాయాన్ని అందజేస్తారు. భూభారతి పోర్టల్ నిర్వహణ సీసీఎల్ఏ ఆదీనంలో ఉంటుంది. రికార్డుల తయారీ, నిర్వహణ, అప్డేషన్, సమయానుగుణంగా మార్పు చేర్పులు, ప్రభుత్వ అనుమతి మేరకు షెడ్యూళ్ల మార్పు, అవసరాలకు అనుగుణంగా ఆదేశాల జారీ, మార్గదర్శకాల రూపకల్పన అధికారాలన్నీ సీసీఎల్ఏ పరిధిలోనే జరుగుతాయి. -
సామాన్యుడికీ అర్థమయ్యేలా భూభారతి
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసిందే భూ భారతి 2025 చట్టం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శిల్ప కళావేదికలో జరిగిన భూభారతి ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ధరణి చట్టం తెచ్చారని భట్టి విమర్శించారు.ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని, కొంతమంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని పాదయాత్రలో రైతులకు భరోసా ఇచ్చామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. జన్మ ధన్యమైంది: పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని వివరించారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. మే మొదటి వారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఫిర్యాదులు స్వీకరించి భూభారతి చట్టాన్ని పటిష్టపరుస్తామన్నారు.జూన్ 2వ తేదీ నాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ గత చట్టంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది భూ భారతి పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గొప్ప రెవెన్యూ చట్టంగా భూభారతిని రూపొందించినట్లు చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాలని.. ఇన్చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆధార్‌లా 'భూధార్'
సాక్షి, హైదరాబాద్: ఆధార్ తరహాలో భూధార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దులు నిర్ణయించి భూధార్ నంబర్ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూధార్ కార్డులు ఇవ్వడం కష్టమేమీ కాదని అన్నారు. ‘ధరణి’ స్థానంలో రూపొందించిన కొత్త ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం ‘భూ భారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భూ రికార్డులు ‘రెవెన్యూ’ ఘనతే..: ‘తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య వరకు సాగించిన పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహారావు వరకు ఎందరో భూసంస్కరణలు తెచ్చారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది. పటా్వరీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్ఓ, వీఆర్ఏలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు. 95 శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..’ అని సీఎం తెలిపారు. ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా అప్పటి ప్రభుత్వం చట్టాలను మార్చింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట భూతంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెడితే, సిరిసిల్లలో ఓ మహిళ తన భూమి కోసం తహసీల్దార్‌కు తన తాళిబొట్టును లంచంగా ఇవ్వజూపింది. ఈ విధంగా ప్రజల బాధలకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి, కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో నేను, భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చాం. కొత్త చట్టం పేదలకు చుట్టంగా ఉండాలని ఎంతో శ్రమించి ‘భూ భారతి’ని తీసుకొచ్చాం. తెలంగాణలో వివాద రహిత భూ విధానం తేవాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టం తెచ్చాం. ప్రజలకు అనుకూలమైనదిగా దీన్ని తీర్చిదిద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభిస్తున్నాం. ఈ చట్టాన్ని ఖమ్మంలో లక్ష మంది ప్రజల సమక్షంలో ప్రజలకు అంకితం చేద్దామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబితే, నేను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలోనే చట్టం అమలు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పా. ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని గౌరవిస్తుంది..’ అని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం చట్టాన్ని మార్చింది.. ‘గతంలో ధరణిని తీసుకువచ్చిన పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 70 ఏళ్లుగా ప్రజల భూములను కాపాడిన రెవెన్యూ సిబ్బంది ధరణి వచ్చిన తర్వాత మీకు దోపిడీదారులుగా కనిపించారా? చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? సమాజంలోని ప్రతి వ్యవస్థలో రెవెన్యూ నుంచి రాజకీయ నాయకుల వరకు 5 నుంచి 10 శాతం వరకు చెడ్డవారు ఉంటారు. చెడ్డవాళ్లను శిక్షించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించి తమ స్వార్థం కోసం చట్టాన్ని మార్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తుల విషయంలో కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. గత పాలకుల్లా..మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం..’ అని సీఎం అన్నారు. కలెక్టర్లు గ్రామ గ్రామానికి వెళ్లాలి ‘రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. మేం తెచ్చిన చట్టాలను మీరు అమలు చేస్తారు. 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లు లాంటివి. కలెక్టర్ల నుంచి సిబ్బంది వరకు గ్రామ గ్రామానికి వెళ్లండి. దోషులుగా చిత్రీకరించిన విధానానికి వ్యతిరేకంగా ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దాం. కలెక్టర్లు ప్రతి మండలంలో పర్యటించాలని ఈ వేదిక నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం . నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోపాలు ఏమైనా ఉంటే సవరించుకున్న తర్వాత అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించుకుందాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ.. ‘కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?, అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు.మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ్క్షప్తి చేశారు.


