అంతులేని దోపిడీ! | Huge Irregularities in registration of agricultural lands at Telangana | Sakshi
Sakshi News home page

అంతులేని దోపిడీ!

Jan 14 2026 2:40 AM | Updated on Jan 14 2026 4:32 AM

Huge Irregularities in registration of agricultural lands at Telangana

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో తవ్వినకొద్దీ వెలుగులోకి అక్రమాలు

ఆడిట్‌లో రెండు రకాల లావాదేవీల్లో తేడాల గుర్తింపు! 

ఆయా లావాదేవీలపై తహసీల్దార్ల వివరణ కోరిన 

ఉన్నతాధికారులు... వాటిల్లో దోపిడీ జరిగినట్లు తేలితే స్కామ్‌ విలువ రూ. వందల కోట్లలోనే.. 

సీసీఎల్‌ఏలో పనిచేస్తున్న వారి అండతోనే ఈ బాగోతం? 

అధికారుల నిర్లక్ష్యం, సాంకేతికత దుర్వినియోగం,సిబ్బంది కుమ్మక్కు కోణంలో దర్యాప్తు 

చలాన్లను ఎడిట్‌ చేయకపోతే కచ్చితంగా హ్యాక్‌ చేసి ఉంటారనే అనుమానం

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చలాన్ల ఎడిటింగ్‌ ద్వారా రూ. 50 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో మరిన్ని విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి తదితర జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంపై ఆరా తీసేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఆడిట్‌లో రెండు రకాల ప్రధాన లావాదేవీల్లో తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. 

ఒకే రిజిస్ట్రేషన్‌ కోసం రెండు చలాన్లు కట్టే వెసులుబాటు ఉండటంతో తక్కువ మొత్తంలో కట్టిన చలాన్‌ను ప్రభుత్వానికి చెల్లించి ఎక్కువ మొత్తంలో కట్టిన చలాన్‌ను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మరల్చుకున్నారని ఆడిట్‌లో తేలినట్లు సమాచారం. అలాగే సేల్‌డీడ్‌ల రిజిస్ట్రేషన్‌ తర్వాత వాటిని రద్దు చేసుకున్నట్లు చూపి క్యాన్సిలేషన్‌ ఫీజు కింద రూ. 2 వేలు చెల్లించి అంతకుముందు చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను కొనసాగిస్తున్నారా అనే సందేహం కూడా ఈ పరిశీలనలో తలెత్తింది. 

అయితే ఈ రెండు అంశాల్లో ఏ మేరకు ఏం జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు అంశాల్లో తేడాలున్న లావాదేవీల వివరాలను తహసీల్దార్లకు పంపి వివరణ కోరారు. ఒకవేళ తాజా ఆడిట్‌లో తేలిన ఈ రెండు అంశాల్లోనూ దోపిడీ జరిగినట్లు తేలితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి.  

నాలుగు స్థానాలు... మూడు కోణాలు 
తాజా కుంభకోణం వెనుక నాలుగు స్థానాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, పోర్టల్‌ ఆపరేటర్లు, సీసీఎల్‌ఏ సిబ్బంది పాత్రతోపాటు తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 

ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, సిబ్బంది కుమ్మక్కు అనే మూడు కోణాల్లో దర్యాప్తు వేగవంతమవుతోందని.. స్కామ్‌ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతోపాటు మిగిలిన చోట్ల జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. 

మరో 4–5 రోజుల్లో అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని అంటున్నాయి. అయితే చలాన్ల ఎడిటింగ్‌ ద్వారానే అక్రమాలు జరిగాయన్నది ఉన్నతాధికారుల ప్రాథమిక అభిప్రాయమైనప్పటికీ అలా జరిగి ఉండకపోతే మాత్రం ఏకంగా పోర్టల్‌ను హ్యాక్‌ చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఒక చలాన్‌... ఎనిమిది ప్రశ్నలు 
1 ఇష్టారాజ్యంగా స్లాట్‌ల బుకింగ్‌కు అనుమతి ఎలా? 
గతంలో ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్‌ ద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ కుంభకోణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రయ, విక్రయదారులతో సంబంధం లేని ఫోన్‌ నంబర్లతో స్లాట్‌లు బుక్‌ చేసి, ఆ స్లాట్‌ ఐడీల ఆధారంగానే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకే ఫోన్‌ నంబర్‌పై 70 నుంచి 100 వరకు స్లాట్‌లను బుక్‌ చేసినట్లు సమాచారం.  

2 ఆ ఉద్యోగులనే ఎందుకు కొనసాగించారు? 
ధరణి పోర్టల్‌ను టెర్రాసిస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ నిర్వహించగా భూభారతి పోర్టల్‌ను ఎన్‌ఐసీకి అప్పగించారు. అయితే అప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది వారే కావడం కూడా ఈ అక్రమాలు కొనసాగేందుకు ఊతమిచ్చిందన్న చర్చ నడుస్తోంది. వేతనాలు తక్కువగా ఉండే పోర్టల్‌ ఆపరేటర్లలో 60 శాతం మంది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌లు బుక్‌ చేసి అదనపు ఆదాయం పొందుతుండటంతో మీ–సేవా కేంద్రాల నిర్వాహకులతోపాటు ఆపరేటర్ల పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. 

3 ఎడిట్‌ చేశారా.. హ్యాక్‌ చేశారా? 
స్లాట్‌ బుకింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించేటప్పుడే చలాన్లను ఎడిట్‌ చేసినట్లు అధికారులు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మీ–సేవా నిర్వాహకులు లేదా ఆపరేటర్లు కట్టిన చలాన్‌లను సీసీఎల్‌ఏ కార్యాలయ సర్వర్‌ వద్ద ఉండే సిబ్బంది ఎడిట్‌ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలా జరగాలంటే మీ–సేవా, ధరణి ఆపరేటర్లు, సీసీఎల్‌ఏ సిబ్బంది కుమ్మక్కు కావాల్సి ఉంటుందని.. అది సాధ్యం కాదనుకుంటే చలాన్‌ దోపిడీ జరిగినప్పుడల్లా రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌నే హ్యాక్‌ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. 

4 తహసీల్దార్లు ఏం చేస్తున్నట్లు? 
అసిస్టెంట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదాలో ఉండే తహసీల్దార్లకు కేవలం భూమి వివరాలు, క్రయ, విక్రయదారుల వ్యక్తిగత వివరాలు సరిచూసుకునే బాధ్యత తప్ప ప్రభుత్వానికి అందాల్సిన మొత్తాన్ని చెక్‌ చేసే వ్యవస్థ వారి వద్ద లేదని.. ధరణి పోర్టల్‌ నుంచే ఇది కొనసాగుతున్నప్పటికీ భూభారతి అమల్లోకి వచ్చినా కూడా దీన్ని మార్చలేదని తెలుస్తోంది. స్లాట్‌ బుకింగ్‌ చేసిన వారు ప్రింట్‌ రూపంలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌కు జత చేసే చలాన్‌ జిరాక్స్‌ను చూసి తహసీల్దార్లు ఎలా సంతకాలు పెట్టారన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.  

5 తనిఖీ వ్యవస్థ లేదా? 
సాధారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలోని ఓ ఉద్యోగి చెక్‌ చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌రిజిస్ట్రార్‌ ఆయా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీజు, చలాన్‌ అంశాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్‌కు పంపుతారు. కానీ వ్యవసాయ భూముల విషయంలో ఒకసారి స్లాట్‌ బుక్‌ అయిన డాక్యుమెంట్‌ నేరుగా తహశీల్దార్లకే వెళ్తోంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ప్రింట్‌ తీశాకే చలాన్‌ ఎంత కట్టారన్నది రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌లో కనిపిస్తోంది. 

6 అప్పుడైనా చూడాలి కదా? 
తహసీల్దార్లు పనిఒత్తిడి వల్ల రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌లో ఎంత చలాన్‌ వచ్చిందో చూడకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారని.. ఇది కచ్చితంగా వారి నిర్లక్ష్యమేనని దర్యాప్తు కమిటీ భావిస్తోంది. అలాగే తహసీల్దార్లకు తెలిసే ఇదంతా జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 

7 ఫీజు ఎంత కడతారో తెలియదా? 
వ్యవసాయ భూములను గత ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్న తహసీల్దార్లకు ఎంత భూమి రిజిస్ట్రేషన్‌కు ఎంత ఫీజు కడతారో కూడా తెలియదని.. 60 శాతం మంది తహసీల్దార్లు ఆఫీసు సిబ్బందిపైనే ఆధారపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ఏ డాక్యుమెంట్‌లో ఏం రాశారో కూడా వారికి అర్థమయ్యే పరిస్థితి లేదని.. ఒకవేళ అర్థమైనా అలా చూసే తీరిక లేదని అంటున్నాయి. 

8 లావాదేవీలను ఆడిట్‌ చేయలేదా? 
సాగు భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు సంబంధించి గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రవ్యాప్త ఆడిట్‌ జరగలేదని, అలా జరిగి ఉంటే ఎక్కువగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిన 2021, 2022లోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేదని తెలుస్తోంది. 

‘నాలా’ఫీజు పెంపు గురించి వారికి 8 నెలల దాకా తెలియదట! 
గతంలో ధరణి పోర్టల్‌ నిర్వహణ పూర్తిగా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉండేదని తహసీల్దార్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి (నాలా) ఫీజును 3 శాతం నుంచి 5 శాతానికి పెంచిన విషయం 7–8 నెలల వరకు తమకు తెలియలేదని వారంటున్నారు. నాలా ఫీజు కింద ఎంత భూమికి ఎంత చలానా కట్టాలో కూడా తమకు తెలిసే పరిస్థితి ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఇక సాధారణ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఫీజు ఎంత కట్టాలో, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో ఏముందో అరకొర శిక్షణ ఇస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా వసూలు చేస్తాం 
‘ఇష్టానుసారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకే గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తెచ్చింది. కనీసం చలాన్‌ ఎంత కట్టారో కూడా సరిచూసుకోలేని విధంగా సాంకేతికతను సమకూర్చింది. తహసీల్దార్లకు సరైన శిక్షణ ఇవ్వకపోగా ఆడిట్‌ వ్యవస్థకు దిక్కేలేదు. ధరణి పోర్టల్‌ స్థానంలో మేం తెచ్చిన భూభారతి పోర్టల్‌కు సాంకేతిక సత్తువ సమకూర్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ధరణి దరిద్రాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా తిరిగి తీసుకుంటాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ 
– మంత్రి పొంగులేటి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement