వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన చలాన్లకు ఇప్పటికీ కలగని మోక్షం
రూ. 87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ఇంకా ప్రభుత్వ ఖజానాలోనే..
చెల్లింపు అధికారాలు సీసీఎల్‌ఏ వద్దే పెట్టుకోవడంతో రైతులకు ఇబ్బందులు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయిన రైతుల సమస్య ఏళ్లు గడిచినా తీరడం లేదు. ఎప్పుడో కట్టిన చలాన్ల డబ్బులు వాపస్ కూడా రావడం లేదు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారమే ఇంకా 27 వేల మంది రైతుల విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఇంకా దరఖాస్తు చేసుకోనివారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో వివరణ ఇచ్చిన ప్రకారమే ఇంకా రూ.87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో ఉండిపోవడం గమనార్హం.
ధరణి కష్టం.. భూభారతిలోనూ కలగని మోక్షం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూములను కూడా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభించారు. ఈ భూముల క్రయ విక్రయాల కోసం రైతులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలోనే సదరు భూమి రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ చలాన్ (డీడీ) రూపంలో ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్నా..ఒకవేళ అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్‌కు వెళ్లలేకపోతే ఆ డీడీలను వెంటనే నగదు రూపంలోకి మార్చుకునేవారు. కానీ ధరణి పోర్టల్‌లో ఒకసారి కట్టిన చలాన్లను నగదు రూపంలోనికి మార్చుకునే ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వారి డబ్బులు అలాగే ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి.
ఈ డబ్బుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ డబ్బు చెల్లించే అధికారం తమకు లేదంటూ తహశీల్దార్ల నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు చేతులెత్తేశారు. దీంతో కొందరు కోర్టుకు వెళ్లి తమ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో చలాన్లను నగదు రూపంలోకి మార్చుకునే ఆప్షన్ ఇవ్వడంతో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకునే వారికి తహశీల్దార్ల ప్రొసీడింగ్స్‌తో సీసీఎల్‌ఏ కార్యాలయం ద్వారా నగదు రూపంలోకి మారుస్తున్నారు. అయితే డీడీలు తీసిన ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే, ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న వారి నగదు విషయంలో మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు సైతం చెబుతున్నాయి.
ఆ దరఖాస్తులు పరిష్కరించరా?
తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31,314 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, అందులో 4,574 దరఖాస్తులను పరిష్కరించి రూ.12.97 కోట్లను రైతులకు చెల్లించారు. కానీ మరో 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించి తమ డబ్బులను తమకు ఇప్పించాలని కోరుతూ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయా చలాన్లను నగదు రూపంలోకి మార్చే అధికారం సీసీఎల్‌ఏకు కట్టబెట్టడంతో సదరు ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ డబ్బులను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.


