
రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యలపై లక్షల్లో దరఖాస్తులు
సాదాబైనామా, అసైన్డ్ భూములపైనే అత్యధికం
ఇన్నాళ్లూ క్షేత్రస్థాయి యంత్రాంగం లేక కదలని ప్రక్రియ
జీపీఓలు, సర్వేయర్ల నియామకంతో పరిశీలనకు మార్గం సుగమం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభించనుందని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్దుతూ ప్రస్తుత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, సమావేశాల్లో లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి.
సర్వే నంబర్లు, ఇంటి పేరు, భూ యజమాని పేరు తప్పుగా ఉండటం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, సర్వే నంబర్లు మిస్ కావడం, సాదాబైనా మా, మ్యుటేషన్, అసైన్డ్ ల్యాండ్ పట్టా, వారసత్వ పట్టా వంటివి దాదాపు 20 కేటగిరీల్లో దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా సాదాబైనామా, అసైన్డ్ భూముల దరఖాస్తులే ప్రభుత్వానికి వచ్చాయి.
సాదాబైనామాలపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఇటీవల తొలగించడంతో తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలు చేసిన రైతులకు ఊరట లభించనుంది. 1969 నుంచి పేదలకు అసైన్డ్ భూములను కేటాయిస్తుండగా లబ్ధిదారులు విక్రయించడానికి వీల్లేకుండా 1977లో అప్ప టి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పీఓటీ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ చాలామందికి అవగాహన లేక భూములు చేతులు మారాయి. ఈ సమస్య పరిష్కారానికి కూడా భూభారతి చట్టం దారి చూపనుంది. ఇప్పటికే అమ్మకం, కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేయగా త్వరలోనే జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించనున్నారు.
రెవెన్యూ వ్యవస్థకు జవసత్వాలు
భూముల సమస్యల పరిష్కారానికి ఉన్న చట్టాల అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం. గతంలో మండలానికి ఒకే ఒక్క సర్వేయర్, వీఆర్‌ఏ, వీఆర్వో దరఖాస్తులు పరిశీలించేవారు. 2020లో అప్పటి ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో దరఖాస్తుల పరిష్కారం క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఉద్వాసనకు గురైన 5,101 మంది వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను జీపీఓ (గ్రామ పాలనాధికారులు)లుగా నియమించింది. అలాగే 7 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు జారీ చేసింది.

మరికొంత సమయం..
భూభారతి ద్వారా భవిష్యత్తులో భూవివాదాలు, ఘర్షణలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. సాదాబైనామాలో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరుగుతుండగా భూమిపై ఒకరు, రికార్డుల్లో మరొకరు యజమానిగా ఉంటున్నారు. భూమి మీద ఉన్న వ్యక్తి క్రమబద్ధికరించాలని భూభారతిలో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పరిష్కారానికి కొంత సమయం పట్టనుంది. అలాగే అసైన్డ్ భూముల విషయంలోనూ విక్రయదారు, కొనుగోలుదారులను పిలిపించి ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.
పరిష్కారంపై ఆశతో ఉన్నా..
వారసత్వం కింద నాలుగు ఎకరాలు రాగా.. మరో నాలుగున్నర ఎకరాల భూమి కొన్నా. కొనుగోలు చేసిన భూమి హక్కుల కోసం 2020లో సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నా. తహసీల్ చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు. తాజాగా కోర్టు తీర్పుతో పరిష్కారంపై ఆశతో ఉన్నా. – బంధం వెంకటేశ్వర్లు, ముష్టికుంట్ల, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా
పాస్ పుస్తకంలో నమోదు చేయాలి..
రంగపేటలో వెల్ది శివారు సర్వే నంబర్ 698ఎ/2/1లో 5.07 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం డీబీఎం–6 కాలువ కోసం ఎకరం 11 గుంటలు తీసుకోగా మిగిలిన 3.36 ఎకరాలకుగాను 2.15 ఎకరాలనే రికార్డుల్లో నమోదు చేశారు. మోకాపై పరిశీలించి నా పేరిట చేయాలని ఐదేళ్లుగా తిరుగుతున్నా. భూభారతితోనైనా సమస్య పరిష్కరించాలి. – మర్రి మల్లారెడ్డి, మానకొండూరు, కరీంనగర్ జిల్లా
మూడేళ్లుగా తిరుగుతున్నా..
ఒక ఎకరం 35 గుంటల భూమి పీఓబీలో పడింది. నా భూమికి సమీపాన దేవాదుల కాల్వ ఉండటం వల్ల నా భూమిని పీఓబీలో పెట్టారు. మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇకనైనా నా భూమిని పీఓబీ నుంచి తొలగించి ఆదుకోవాలి. – బానోతు హరిలాల్, ఆల్వార్ బండ తండా(శంకర్ తండా), జఫర్‌గఢ్, జనగామ జిల్లా
భూ భారతితో సమస్యలు పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు ధరణి పోర్టల్‌తో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలన్నీ భూభారతితో పరిష్కారమవుతాయి. జీపీఓల నియామకంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుంది. త్వరలో చేపట్టే సమగ్ర భూసర్వేతో అన్ని రకాల సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం లభిస్తుంది. – గరికె ఉపేంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు, జీపీఓల సంఘం
క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి
నేను యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్/వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. అంతకుముందు 12 ఏళ్లపాటు రెవెన్యూ శాఖలో పని చేశా. వీఆర్వో వ్యవస్థ రద్దుతో మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరా. మేం తిరిగి రెవెన్యూలోకి వస్తామనుకోలేదు. అలాంటిది జీపీఓగా రావడం ఆనందంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. – తోకల శిరీష, గంధమల్ల, తురకపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా (జీపీఓ, సిద్దిపేట జిల్లా)