
ఇందులో కాంగ్రెస్ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొనాలి
బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనే..
బీసీ రిజర్వేషన్లపై 23న కేబినెట్‌లో చర్చిస్తాం
సింగరేణి దీపావళి బోనస్ రూ.400 కోట్లు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుందని.. ఆ పార్టీ నైజం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తం తెలిసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా శనివారం నిర్వహించే బీసీల బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజ ర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలోనే ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని భట్టి తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా అనుమతి రాలేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం నాయకత్వం వహించాలని సూచించారు.
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల బోనస్ ప్రకటించామని భట్టి తెలిపారు. సింగరేణి కార్మి కులకు దీపావళి బోనస్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొత్త సీతారాములు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.