ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..! | Diwali 2025: How Diwali is Celebrated in Different Parts of India | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!

Oct 19 2025 11:44 AM | Updated on Oct 19 2025 12:33 PM

Diwali 2025: How Diwali is Celebrated in Different Parts of India

దీపాల కాంతితో ధగధగ మెరిసే ఈ దీపాల పండుగ ఇష్టపడని వారుండరు. అలాంటి మిరుమిట్లు గొలిపే ఈ పండుగ.. టపాసుల మోత మోగిపోయేలా ఆనందహేలి తాండవించేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి పండుగా మన దేశంలోనే పలు రాష్టాలు అత్యంత విభిన్నంగా జరుపుకుంటాయి. ఈ దీపావళి పండుగ నేపథ్యంలో ఆ విశేషాలు గురించి సవిరంగా తెలుసుకుందామా..!

చీకటి దీపావళి!
దీపావళి వేడుకల తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్‌ప్రదేశ్‌కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.

దేవరి రాత్రి
ఛత్తీస్‌ఘడ్‌లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీ΄ాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.

ఆవులను తమపై నడిపించి..
మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్‌ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీ΄ావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.

భర్త కోసం రాత్రంతా దీపాలు...
మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.

శ్రీవిష్ణువు భూలోకానికి...
గుజరాత్‌లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్‌లో దీపావళి జరుపుకుంటారు. కోల్‌కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.

సోదర, సోదరీమణులు...
మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.

లక్ష దీపాల ఆగ్రా కోట 
అక్బర్‌ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్‌’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగి΄ోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement