
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?
– దీప్తి, హైదరాబాద్ .
గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు.
సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం.
ఫోలిక్ యాసిడ్‌తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.
నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?
– శ్వేత, విజయనగరం.
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు.
దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది.
అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి.
అంటే బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్‌ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!)