
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?
– మాలిని, గుంటూరు.
గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది.
గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి.
హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్‌తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా?
– సుగుణ, మిరియాలగూడ.
గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది.
ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి.
మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్‌వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి.
వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి.