
‘‘అమ్మా.. నేను క్లాస్ ఫస్ట్ వచ్చా!’’ ‘‘వావ్... కంగ్రాచ్యులేషన్స్ నాన్నా. నువ్వు తెలివైనవాడివి! ’’ అని మెచ్చుకుంది తల్లి. తల్లి ప్రశంసలతో ఆ బిడ్డ కాసేపు సంతోషపడుతుంది. గర్వపడుతుంది. కానీ వారం తర్వాత కాస్త కష్టమైన టాపిక్ రాగానే, ‘‘నేను తెలివైనవాడినైతే ఇది ఎందుకు రాలేదు?’’ అని ఆలోచనలో పడిపోతుంది. అక్కడినుంచి మెల్లగా మోటివేషన్ పోతుంది.
ప్రశంస అంటే కేవలం మాటలు కాదు. అది మెదడులోని న్యూరాన్లకు ఇచ్చే సూచన. ప్రతి మాట మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లు నెలకొల్పుతుంది. అందుకే మెచ్చుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెచ్చుకున్నా తప్పేనా? పిల్లలు ఏదైనా సాధించగానే ‘‘శభాష్, నువ్వు బెస్ట్, నువ్వు ఇంటెలిజెంట్’’ అని టీచర్లు, పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇలాంటి తప్పు రకమైన ప్రశంసలు పిల్లలను ట్రాప్‌లో పడేస్తాయి.
ఇతరులతో పోల్చే ప్రశంస తాత్కాలికంగా ఉత్సాహాన్నిస్తుంది. కాని, ‘ఇతరులకంటే ముందుండడమే నాకు విలువ’ అనే తప్పు నమ్మకాన్ని ఏర్పరుస్తాయి.
చిన్న విషయాలకే పెద్ద ప్రశంసలు ఇస్తే వాటి విలువ తగ్గిపోతుంది.
నువ్వు సక్సెస్ అయితేనే ప్రశంసిస్తామనే తీరు చాలా ప్రమాదకరం. దీంతో ఆప్యాయతను పర్ఫార్మెన్స్‌తో లింక్ చేసుకుంటారు.
తరచుగా ప్రశంసలపై ఆధారపడితే పిల్లలు అంతర్గత కుతూహలం కోల్పోతారు. స్వతంత్రంగా ప్రయత్నించడం తగ్గిపోతుంది.
ప్రశంసలో నిజాయితీ లేకపోతే పిల్లల నమ్మకం దెబ్బతింటుంది.
సైన్స్ ఏమంటుంది?
పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మీరిచ్చే ప్రశంసలు వారి మెదడును, మైండ్ సెట్‌ను షేప్ చేస్తాయని వాటిలో వెల్లడైంది.
న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు అనుభవాల ఆధారంగా రీవైర్ చేసుకుంటుంది. ప్రయత్నం, పద్ధతి, పట్టుదలపై ఇచ్చే ప్రశంస డోపమైన్ అనే ‘మోటివేషన్ కెమికల్’ను విడుదల చేస్తుంది.
ఎపిజెనెటిక్స్: జీన్స్ మన జీవితాన్ని నిర్ణయించవు. ఏ జీన్స్ ‘ఆన్’ అవ్వాలి, ఏవి ‘ఆఫ్’ అవ్వాలనేది వాతావరణం నిర్ణయిస్తుందని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెప్తున్నాయి.
సెల్ఫ్–డిటర్మినేషన్ థియరీ: పిల్లలు సక్సెస్ అవ్వాలంటే అటానమీ, కాంపిటెన్స్, రిలేటెడ్‌నెస్ అనే మూడు అవసరాలు తీరాలి. సరైన ప్రశంస ఈ మూడింటినీ అందిస్తుంది.
ఫ్లో సైకాలజీ: ఫ్లో స్టేట్ అంటే నైపుణ్యాలు, సవాళ్లు సమపాళ్లలో ఉండే స్థితి. సరైన ప్రశంస పిల్లలను ఫ్లో స్టేట్ వైపు నెడుతుంది. అప్పుడే పిల్లల అసలు జీనియస్ వెలుగులోకి వస్తుంది.
సరైన ప్రశంసలకు 10 టిప్స్...
‘‘నువ్వు స్టెప్ బై స్టెప్‌గా చేసిన తీరు చాలా నచ్చింది’’ అని ప్రాసెస్‌ని గుర్తించండి.
‘‘నీ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. సైంటిస్ట్‌లా ఆలోచిస్తున్నావు’’ అని క్యూరియాసిటీకి విలువనివ్వండి.
‘‘ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వదల్లేదు, అదే నిజమైన శక్తి’’ అని ప్రయత్నాన్ని హైలైట్ చేయండి.
‘‘నీ ఆలోచన ప్రత్యేకంగా ఉంది’’ అని ఒరిజినాలిటీని సెలబ్రేట్ చేయండి.
‘‘గతంలో కష్టమనిపించింది ఇప్పుడు బాగా చేశావు. ఇదే నిజమైన అభివృద్ధి’’ అని ఇంప్రూవ్‌మెంట్‌పై ఫోకస్ చేయండి.
‘‘నీ వ్యాస పరిచయం చాలా స్పష్టంగా ఉంది’’ అని స్పెసిఫిక్‌గా చెప్పండి.
‘‘ఒకే సమస్యకు పలు మార్గాల్లో ప్రయత్నించడం చాలా స్మార్ట్ స్ట్రాటజీ’’ అని ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని ప్రోత్సహించండి.
‘‘ఈ ప్రాజెక్ట్‌లో ఏ భాగం నీకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది?’’ అని రిఫ్లెక్షన్‌కి దారి చూపండి.
‘‘ఈ పనిని ప్రేమగా చేసినప్పుడు ఎంత అందంగా వచ్చిందో గమనించావా?’’ అని ఎఫర్ట్‌తో పాటు ఎమోషన్ని గుర్తించండి.
‘‘ఇది బాగా చేశావు, ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ప్రయత్నిస్తావా?’’ అని ప్రశంసని చాలెంజ్‌తో కలిపి ఇవ్వండి.
సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
(చదవండి: వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!)