గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతలు
చంద్రబాబు సర్కారుపై గళమెత్తిన విద్యార్థి దళం
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులా?
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు తక్షణం అమలు చేయాలి
లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం: విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ హెచ్చరిక
గాందీనగర్(విజయవాడసెంట్రల్)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్)/నరసరావుపేట/కర్నూలు(సెంట్రల్): ఉక్కు సంకెళ్లు బిగిసినా సంకల్పం సడలలేదు. పిడికిలెత్తిన విద్యార్థిలోకం బెదరలేదు. సర్కారు తీరుపై గళమెత్తి గర్జిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగ పాలనపై సమరభేరి మోగిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నినదించారు. అక్రమ కేసులపై కన్నెర్రజేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నేతలపై రౌడీషిట్లు ఓపెన్ చేసి, అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండించారు.
శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నల్లరిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజేంద్ర బాబు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీషీట్లు తెరిచి అక్రమ ఆరెస్ట్‌లకు పాల్పడడం తగదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ‘మెగా డీఎస్సీ’, ‘జాబ్ క్యాలెండర్’, నిరుద్యోగభృతి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ హామీలను అమలు చేయాలని కోరడం నేరమా! అని ప్రశ్నించారు. విశాఖలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, పార్టీ యువజన విభాగం నేతలు పాల్గొన్నారు.
⇒ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.
⇒ పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పాల్గొన్నారు.
⇒ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలని.. లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలైనా ఇవ్వాలంటూ విద్యార్థి, యువజన సంఘాల వేదిక కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టింది. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సోమన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ పాల్గొన్నారు.


