పనపాకంపేట మోడల్ స్కూల్ వద్ద విద్యార్థులతో కలసి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు
దళిత విద్యార్థులతో కలిసి తమ పిల్లలు చదువుకునేందుకు కొందరు తల్లిదండ్రుల నిరాకరణ
చిత్తూరు జిల్లా పనపాకంపేట మోడల్ స్కూల్ నుంచి 20 మందిని పాత పాఠశాలకు తీసుకెళ్లిన వైనం
టీడీపీ నేతల ఒత్తిడితో ఆ పాఠశాలకు మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు టీచర్లు..
మూసివేసిన పాఠశాలలోనే అనధికారికంగా విద్యాబోధన
మోడల్ స్కూల్‌లో మిగిలిన ఒకే ఉపాధ్యాయుడు
తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని మోడల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
చంద్రగిరి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంపేట మోడల్ స్కూల్‌లో కుల వివక్ష చోటుచేసుకుంది. తమ పిల్లలను దళిత విద్యార్థులతో కలిసి చదివించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. టీడీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి అనధికారికంగా పాత పాఠశాలలోనే తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. అయితే, మోడల్ స్కూల్‌లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీలో ఉన్న అరిగెలవారిపల్లి, ఇరివిశెట్టివారిపల్లి, తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాలలను పనపాకంపేట ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి మోడల్ స్కూల్‌గా ఏర్పాటుచేశారని చెప్పారు. ఇక్కడ సుమారు 65 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించారని తెలిపారు. నెలరోజులపాటు పాఠశాల సవ్యంగా సాగిందన్నారు.
ఆ తర్వాత పనపాకంపేట మోడల్ స్కూల్‌లో ఆ గ్రామ దళిత విద్యార్థులు ఉన్నారని, వారితో కలిసి చదువుకునేందుకు తమ పిల్లలను పంపించబోమని అరిగెలవారిపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారని పేర్కొన్నారు. వారి పిల్లలను మోడల్ స్కూల్‌కు పంపకుండా నిలిపేశారని వివరించారు. ఆపై టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని అనధికారికంగా అరిగెలవారిపల్లిలోని పాత పాఠశాలలోనే వారి పిల్లలను తిరిగి చేరి్పంచారని తెలిపారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లిలోని పాత పాఠశాలకు విద్యాశాఖ అ«ధికారులు సైతం మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారని పేర్కొన్నారు.
త్వరలో సమస్య పరిష్కరిస్తాం: ఎంఈవో
ఈ విషయంపై ఎంఈవో లలిత కుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా... అరిగెలవారిపల్లి నుంచి విద్యార్థులు రావడానికి ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఊరిలోనే పాఠశాల కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల ఆందోళనల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆమె వివరించారు.
మా పిల్లల చదువులు అటకెక్కాయి
పనపాకంపేట మోడల్ స్కూల్‌లో 45 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మిగిలారని తల్లిదండ్రులు తెలిపారు. వారిలో ఒక ఉపాధ్యాయుడు పది రోజుల కిందట డిప్యూటేషన్‌పై మరో పాఠశాలకు వెళ్లడంతో తమ పిల్లల చదువులు అటకెక్కాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో పిల్లలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు విద్యాశాఖ అ«ధికారులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లి పాఠశాలలో 20 మంది పిల్లలు ఉన్నారని, అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి, ఇక్కడ మాత్రం 45 మంది విద్యార్థులకు ఒకే ఒక్కరిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. దళిత విద్యార్థులంటే అధికారులకు చిన్నచూపా... అంటూ మండిపడ్డారు. మూడు గ్రామాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి, అరిగెలవారిపల్లి టీడీపీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేవలం దళితులు ఉన్న పాఠశాల కావడంవల్లే అధికార పార్టీ నేతలు వివక్షతోనే మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.


