పండుగను ఆస్వాదిద్దాం | Vadrevu Veeralakshmi Devi Sankranthi special story | Sakshi
Sakshi News home page

పండుగను ఆస్వాదిద్దాం

Jan 12 2026 6:12 AM | Updated on Jan 12 2026 6:12 AM

Vadrevu Veeralakshmi Devi Sankranthi special story

అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్‌మెంట్‌ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్‌ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి  వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. 

‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. 

దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్‌ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.

మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్‌ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్‌ టాకీస్‌ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్‌ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది.  కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. 

నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల  వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్‌ నుంచి డైరెక్ట్‌గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. 

ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి  రోజులో ఎక్కువ గంటలు సెల్‌ఫోన్‌తో జీవిస్తున్నాడు. కానీ సెల్‌ఫోన్‌ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్‌ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. 

బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్‌లు నిండి పోతున్నాయి.

తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. 

కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్‌ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా  పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్‌ వేరు.  నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్‌ అన్నది కూడా గ్లోబలైజేషన్‌ తాలూకు జార్గాన్‌ అని. ఎంజాయ్‌మెంట్‌ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.

సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. 

‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి 
రచయిత్రి, సాహితీ విమర్శకులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement